logo

పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్‌..

ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్‌ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు.

Published : 08 May 2024 02:45 IST

ఉభయ జిల్లాలకు సుమారు 3 లక్షలు సరఫరా
పాల్వంచ, న్యూస్‌టుడే

పాత కొత్తగూడెంలోని గోదాములో దిగుమతి అయిన పుస్తకాలను పరిశీలిస్తున్న
డీఈఓ వెంకటేశ్వరాచారి, ఏఎంఓ నాగరాజశేఖర్‌, నిర్వాహకుడు రవిప్రతాప్‌

ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్‌ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌లను దశల వారీగా సరఫరా చేస్తున్నారు.

‘2024-2025’ విద్యా సంవత్సరంలో కొత్త ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల్లో ముఖ్యమైనది పాఠ్య పుస్తకాల బరువు తగ్గించడం. గతంలో పాఠ్యాంశాలు ముద్రించిన పేపరు బరువు కాస్త ఎక్కువగా ఉండేది. పుస్తకాలు మోసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈసారి ఈసమస్య ఉత్పన్నం కాకుండా తక్కువ బరువుండే పేరుతో పుస్తకాలు హైదరాబాద్‌లో ముద్రిస్తున్నారు. సిద్ధమైన వాటిని ఆలస్యం చేయకుండా, రాత పుస్తకాలతో కలిపి జిల్లా కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉభయ జిల్లాల విద్యార్థులకు కావాల్సిన ఇండెంట్‌లో అన్ని సబ్జెక్టుల్లో 25 శాతం వరకు పుస్తకాలు చేరుకున్నాయి. జిల్లాకు సుమారు 4 లక్షల చొప్పున నోట్‌ పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఒకలోడు సరఫరా చేయగా, గోదాముల్లో భద్రపరిచారు. ఈనెల చివరి నాటికి పుస్తకాల సరఫరా వంద శాతం పూర్తవుతుందని విద్యాశాఖ చెబుతోంది. జూన్‌ రెండోవారం తరగతులు పునః ప్రారంభం అయ్యే నాటికే విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు అందించేలా జిల్లా స్థాయి యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.

గోదాముల్లో భద్రం..

అన్ని రకాల ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యాలయాలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా జరుగుతోంది. తరగతుల వారీ ఇండెంట్‌ను మండల విద్యా శాఖాధికారుల డీఈఓలు నుంచి సేకరించారు. ఆ వివరాలను గతనెల ఆరంభంలోనే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా కేంద్రాల్లోని గోదాములకు ప్రస్తుతం పాఠ్యపుస్తకాల లోడ్లు వస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు తరగతుల వారీగా అందజేయాల్సిన రాత పుస్తకాలకు సంబంధించి ఇప్పటికే ఒక లోడు అందినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు జిల్లా గోదాముల్లో దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన వాటిని త్వరలో మండలాల వారీగా పంపిణీ చేస్తాం. ప్రభుత్వ, కేజీబీవీ, ఎయిడెడ్‌, గురుకులాలు, ఆశ్రమ విద్యాలయాలకు సకాలంలో పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటాం’.

వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని