logo

అదనపు సమయం.. ఓటుకు పోటెత్తాలి జనం

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ సమయం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తద్వారా పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

Published : 09 May 2024 03:28 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ సమయం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తద్వారా పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు  కొనసాగుతుంది. ఈసారి గంట సమయాన్ని ఎన్నికల సంఘం పొడిగించింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్‌ జరగనుంది.

 ఖమ్మం జిల్లాలో ఒకలా.. భద్రాద్రిలో మరోలా..

 పెరిగిన పోలింగ్‌ సమయం కేవలం ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గాలకు మాత్రమే వర్తించనుంది. ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ సాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం భద్రాద్రి జిల్లాలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియనుంది. ఈ జిల్లాలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి.

2019లో తగ్గిన పోలింగ్‌ శాతం

ఓటర్లు స్వీయప్రేరణతో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చేలా యంత్రాంగం అవగాహన కల్పించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించటం లేదు. 2014లో ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో 82.20 శాతం పోలింగ్‌ నమోదవగా.. 2019లో 75.30 శాతానికి పడిపోయింది. మహబూబాబాద్‌ స్థానం పరిధిలో 2014లో 81.21 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా.. 2019లో 69.06 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఈసారైనా.. మారేనా

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించటం లేదు. ఓటేసేందుకు కొందరు ప్రజలు సుముఖత చూపటం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మూడు విడతల్లో పోలింగ్‌ 70 శాతం దాటకపోవటం గమనార్హం. పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించటంతో కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లటం, ఇంకొందరు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకపోవటం, అభ్యర్థులపై  విముఖత వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి అదనపు పోలింగ్‌ సమయం వల్ల ఓటింగ్‌ శాతం ఏమేరకు పెరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని