logo

భాజపాకు మాదిగలు ఓటేయొద్దు

అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్‌ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు.

Updated : 10 May 2024 06:06 IST

తప్పుదారి పట్టిస్తున్న మందకృష్ణ, మోత్కుపల్లి
ఐకాస వ్యవస్థాపకుడు పిడమర్తి రవి

మాట్లాడుతున్న పిడమర్తి రవి, చిత్రంలో వక్కలగడ్డ సోమచంద్రశేఖర్‌

ఖమ్మం ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్‌ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో గురువారం మాట్లాడారు. రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహులు మాదిగలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు, హక్కులను కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మొదటి దెబ్బ ముస్లింలపై, రెండో దెబ్బ దళితులపైన పడుతుందన్నారు. మోదీ రామాలయం కట్టి ఓట్లు అడుగుతున్నారని.. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే మాదిగలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో వర్గీకరణ కేసు రిజర్వు అయిందని, తీర్పు అనుకూలంగా వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే దాన్ని అమలుచేయాల్సి ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి గెలిస్తే మందకృష్ణ ఎక్కడికి పోతార[ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మాదిగలకు పదవులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రెండుచోట్ల సీటు కేటాయించకపోవడం వల్ల మాదిగలకు వచ్చిన నష్టం ఏమీ లేదని, భాజపా గెలిస్తే భవిష్యత్తే లేకుండా చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మాదిగ నేత వక్కలగడ్డ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఖమ్మంలో 3.50 లక్షల మంది మాదిగలు అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తపాక నర్సింహారావు, మాదిగ ఐకాస  నాయకులు మోదుగు జోగారావు, తెలంగాణ బహుజన సమితి రాష్ట్ర కన్వీనర్‌ గజ్జెల్లి    మల్లికార్జున్‌, మాదిగ విద్యార్థి ఓయూ ఐకాస అధ్యక్షుడు జోగు గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని