logo

ప్రజా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి

ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అభద్రత నెలకొంది. ప్రజా ఉద్యమానికి తెదేపా నాయకులు సిద్ధంగా ఉండాలి. మా భవిష్యత్తు తెదేపాతోనే అంటూ యువకులు ముందుకొస్తున్నారు. మహిళలు, వృద్ధులు తెదేపాను ఆశీర్వదిస్తున్నారు. నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని తెదేపా అధినేత చంద్ర

Published : 20 May 2022 06:22 IST

కార్యకర్తలకు పిలుపునిచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు

జలదుర్గంలో అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన సభ

డోన్‌లో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

ఈనాడు - కర్నూలు, కర్నూలు సచివాలయం, డోన్‌ గ్రామీణం, ప్యాపిలి -న్యూస్‌టుడే: ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అభద్రత నెలకొంది. ప్రజా ఉద్యమానికి తెదేపా నాయకులు సిద్ధంగా ఉండాలి. మా భవిష్యత్తు తెదేపాతోనే అంటూ యువకులు ముందుకొస్తున్నారు. మహిళలు, వృద్ధులు తెదేపాను ఆశీర్వదిస్తున్నారు. నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. అధికార వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతోపాటు తెదేపా విధానాలు.. భవిష్యత్తు వ్యూహంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరికపై వేదవతి, ఆర్డీఎస్‌, ఎల్లెల్సీ, గుండ్రేవుల వంటి నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి మంజూరు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పనులు చేయకుండా రైతులకు నష్టం మిగిల్చిందన్నారు. మూడేళ్లలో కర్నూలుకు ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు, విమానాశ్రయం, ఉర్దూ విశ్వవిద్యాలయం తీసుకొచ్చి అభివృద్ధికి బీజం వేసింది తెదేపానే అని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలు నగరంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం వెల్దుర్తి మీదుగా డోన్‌కు వెళ్లారు. అక్కడ రోడ్‌ షో తర్వాత ప్యాపిలి మండలం జలదుర్గంలో నిర్వహించి బాదుడే... బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. వర్షం కురుస్తున్నా చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

కర్నూలు నగర శివారు నందికొట్కూరు రోడ్డులోని కమ్మ సంఘం కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఎడ్లబండిపై వచ్చారు. గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డిల ఆధ్వర్యంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా సభావేదిక వద్దకు వెళ్లారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని సాగనివ్వం.. తరిమేస్తామని చంద్రబాబు డోన్‌లో జరిగిన రోడ్‌షోలో హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో గుద్దుడే.. గుద్దుడుతో వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన అర్థంకాని లెక్కలు చూపుతున్నారన్నారు. బుగ్గన ఖబడ్డార్‌.. తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తావా.. బేతంచెర్లలో విజిలెన్స్‌ తనిఖీల పేరుతో వేధిస్తావా.. తాము అధికారంలోకి రాగానే నీ ఆర్థిక లెక్కలు సంగతి తేలుస్తామన్నారు. బుగ్గనకు పోటీగా సుబ్బారెడ్డిని దింపుతున్నామన్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎన్‌ఎండీ ఫరూక్‌, కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుడిసె కృష్ణమ్మ, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, తెదేపా నియోజకవర్గ బాధ్యులు మీనాక్షి నాయుడు, బీసీ జనార్ధన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, కేఈ శ్యాంబాబు, తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్‌, హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మొమిన్‌ అహ్మద్‌ ఉసేన్‌, పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సి.అరుణకుమారి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌, సోమిశెట్టి తదితరులు ఉన్నారు.

సమన్వయంతో ముందుకెళ్లాలి

నగరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొంటూ ప్రజలకు భరోసాగా ఉండాలి. బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. వైకాపాపై పోరాడే ప్రతి తెదేపా కార్యకర్త వీరుడే. అధికార పార్టీ తాటాకు చప్పుళ్లకు తెదేపా సైనికులు భయపడరు. మండలాలు, గ్రామాలు, జిల్లాలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అధిష్ఠానం ఆదేశాలకు తగ్గట్టు కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్లాలి.. నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెప్పలేదు కాబట్టి గ్రామాల్లో చేయలేదని చెప్పడం భావ్యం కాదు. సమన్వయంతో ముందుకెళ్లాలి... గ్రూపులు పెడితే సహించేది లేదు. అందరి ఆశయం ఒక్కటే.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలుగుదేశం గెలిచేలా పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

కార్యకర్తల ఆరోగ్యంపై దృష్టి

ఒంగోలులో త్వరలో నిర్వహించే మహానాడులో ఓ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నాం.‘‘ ఫుడ్‌ అండ్‌ మెడిసిన్‌’’లో భాగంగా అనారోగ్య సమస్యలున్న కార్యకర్తలను ఆసుపత్రుల్లో చేర్పించి రాయితీపై వైద్యం అందిస్తాం. పేదవాళ్లు అయితే ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచనా చేస్తున్నామన్నారు. మంచి నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళిక రచిస్తున్నాం. అవసరమైతే కొత్త సైన్యాన్ని తయారు చేసుకోవాలి.

తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం

జలదుర్గంలో ఆర్ధరాత్రి జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరైన జనం

మహానాడును తలపించేలా కర్నూలులో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారంటూ చంద్రబాబు కితాబిచ్చారు. సభ విజయవంతం కావడంతో రెండు జిల్లాల నేతల్లో సంతోషం వెల్లువెత్తింది. వెల్దూర్తి, డోన్‌లో నిర్వహించిన రోడ్‌షోల్లో జనం బ్రహ్మరథం పట్టారు. డోన్‌ నుంచి జలదుర్గం రావడానికి దాదాపు మూడున్నర గంటపైగా పట్టింది. అప్పటి వరకు జలదుర్గంలో తెదేపా అభిమానులు వేచి ఉండటం గమనార్హం. నియోజకవర్గ బాధ్యుడుగా బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డికే డోన్‌ టిక్కెట్‌ అని చెప్పకనే చెప్పడంతో కార్యకర్తలు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు.

మద్యం డబ్బు జగన్‌ జేబుల్లోకి..

‘నా జీవితంలో ఇలాంటి పనికి మాలిన దద్దమ్మ ముఖ్యమంత్రిని చూడలేదు. ప్రజలంటే గౌరవం, లెక్కలేని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి’ అని బాదుడే-బాదుడులో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. ఒకప్పుడున్న బ్రాండ్‌లు ఇప్పుడు లేకుండా జగన్‌ బ్రాండ్‌లు.. నాసిరకం మందు సరఫరా చేస్తున్నారు. ఆయన తయారీదారు.. ఆయనే అమ్మకదారుడు అని గుర్తు పెట్టుకోవాలి. ఆన్‌లైన్‌ పేమెంట్లు తీసుకుంటే ప్రభుత్వానికి పోతుంది.. అలా కాకుండా డబ్బుకు తీసుకుంటే జగన్‌ జేబులోకి పోతుందన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరలతో పేదవాడు ఏ విధంగా బతకాలి? మరోవైపు గ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వంలో విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. మోటార్లకు మీటర్లు అంటూ రైతులకు ఉరి బిగిస్తున్నారు. రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో రైతులకు రూ.1.50 లక్షలు రుణమాఫీ చేసి ఒకేసారి ఖాతాలో జమ చేశా. రైతు భరోసా చెప్పినంత వేయకుండా కోతలు విధిస్తున్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ కింద 90 శాతం రాయితీ ఇవ్వడంతోపాటు వ్యవసాయ యాంత్రీకరణ, మద్దతు ధర, ఎరువులు, విత్తనాలు.. ఇలా ప్రతిదీ తెదేపా హయాంలో రైతుకు వెన్నంటే ఉన్నాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి 120 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి డెల్టాకు తీసుకొచ్చి శ్రీశైలం నీటిని రాయలసీమ జిల్లాలకు తెచ్చిన ఘనత తెదేపాదే. 68 చెరువులు, వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్‌ పూర్తి చేసి పశ్చిమాన నీళ్లు ఇవ్వాలని తెదేపా చూస్తే వీటికి సంబంధించి వైకాపా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు.

వర్షంలోనూ ఎదురుచూసిన ప్రజలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్‌ షో ప్రారంభమైన కొద్దిసేపటికే డోన్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు రోడ్‌షోకు పెద్దఎత్తున తరలొచ్చిన ప్రజలు వర్షంలోనూ గొడుగులు, ప్లాస్టిక్‌ కవర్లు, బ్యానర్లను కప్పుకొని మరీ ఎదురుచూశారు. వర్షం కారణంగా దాదాపు గంటపాటు ఆలస్యంగా సాగిన రోడ్‌ షోలో చంద్రబాబును చూసేందుకు పట్టణంలోని మహిళలు రహదారుల వెంట పెద్దఎత్తున వేచిచూశారు.

కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే - సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు

రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలి.. మంచి రాజ్యం రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. సీఎం జగన్‌ పని అయిపోయింది. జగన్‌ను రాష్ట్రం నుంచి పారదోలాలి. జగన్‌కు సీఎంగా పనిచేసే అర్హత లేదు. వైకాపా పాలనలో నిత్యం బాదుడే.. బాదుడుతో ప్రజలు విసిగిపోయారు. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.

ఇన్‌ఛార్జిలతో సమీక్ష

ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో విడివిడిగా మాట్లాడారు. తొలుత సీనియర్‌ నాయకులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తితో అరగంట సేపు మాట్లాడారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తిక్కారెడ్డి ఆధ్వర్యంలో మాధవరం ఎంపీటీసీ, వాల్మీకి అమర్‌నాథ్‌రెడ్డి, కృష్ణమోహన్‌, కోసిగికి చెందిన మైనార్టీ నాయకులు కళంధర్‌ బాషా, ఉమర్‌ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకొన్నారు. వారికి చంద్రబాబు కండువాలు కప్పి ఆహ్వానించారు.

రైతులు, కార్మికులను విస్మరించారు - గౌరు వెంకటరెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు

ఆరుగాలం కష్టించి పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అన్ని రకాల ధరలను పెంచేయడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ట్రాక్టర్లు, వ్యక్తిగతంగా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఇవ్వగా ఈ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండా పోయింది. ఇసుక కొరతతో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక రంగం కుప్పకూలిపోయింది.

విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబానికి భరోసా

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తెదేపా నాయకుడు రాజవర్ధన్‌రెడ్డి మృతి చెందారు. ఆయన తండ్రి విష్ణువర్ధన్‌రెడ్డి, కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అరగంట సేపు ప్రత్యేకంగా సమయం కేటాయించి ఓదార్చారు.

జలదుర్గంలో చంద్రబాబుకు మేకపిల్లను అందజేస్తున్న కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని