logo

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి

సిమెంట్‌ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో నిర్మించిన రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.

Published : 29 Sep 2022 03:42 IST

బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని

బనగానపల్లి, కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: సిమెంట్‌ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో నిర్మించిన రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ... గతంలో ముఖ్యమంత్రి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డాగా ఉన్న కొలిమిగుండ్ల మండలం ఇప్పుడు పరిశ్రమలతో కళకళలాడుతోందన్నారు. అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. త్వరలోనే ఫ్రిజం సిమెంట్‌ పరిశ్రమ వస్తుందన్నారు. పరిశ్రమ కోసం పొలాలు ఇచ్చిన రైతు కుటుంబాలకు తప్పకుండా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యంపై ఉందన్నారు. పరిశ్రమలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇక్కడ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేయాలని కోరారు. కళశాల వస్తే ఎంతో మంది విద్యార్థులు టెక్నికల్‌గా చదువుకొని పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందుతారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కళాశాలపై హామీ ఇవ్వకుండా వెళ్లారు
సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొలిమిగుండ్లకు పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. వేదికపై సభలో పరిశ్రమ ఛైర్మన్‌ వెంకటరామరాజు, పరిశ్రమలో ఇద్దరు సభ్యులతోపాటు ఎమ్మెల్యే కాటసాని, మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరామచంద్రారెడ్డి, ఆంజాద్‌బాషా, ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని