logo

వణికిస్తున్న ముద్దచర్మ వ్యాధి

ఉమ్మడి జిల్లాలో ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్‌) బారిన పడుతున్న పశువుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివారణ నిమిత్తం చేపట్టాల్సిన టీకాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 3.61 లక్షల తెల్ల జాతి పశువులు, 4.13 లక్షల నల్ల జాతి పశువులు ఉన్నాయి.

Published : 02 Oct 2022 01:56 IST

డోన్‌లో నిర్ధారణ

మందకొడిగా టీకా ప్రక్రియ

కర్నూలు వ్యవసాయం, డోన్‌ న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్‌) బారిన పడుతున్న పశువుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివారణ నిమిత్తం చేపట్టాల్సిన టీకాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 3.61 లక్షల తెల్ల జాతి పశువులు, 4.13 లక్షల నల్ల జాతి పశువులు ఉన్నాయి. రెండు లక్షల టీకాలు రాగా వచ్చినవి పూర్తిస్థాయిలో వేయలేదు. సగం తెల్ల జాతి పశువులకు వేశారు. 20 శాతం టీకాలొస్తే పది శాతం పశువులకే టీకాలు వేయడం గమనార్హం.

క్రమంగా విస్తరిస్తోంది

* కర్నూలు మండలం ఉల్చాల, నిడ్జూరు, దిన్నెదేవరపాడు, గార్గేయపురం, కల్లూరు, నందవరం మండలం హాలహర్వి, కల్లూరు మండలం నాయకల్లు, తడకనపల్లి మజరా వామసముద్రం, దేవనకొండ మండలం మాచాపురం, కప్పట్రాళ్ల, ఆదోనిలోని అర్జున్‌జ్యోతి నగర్‌, సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల, ఓర్వకల్లు మండలం చింతలపల్లి, ఆదోని మండలం బల్లేకల్లు, పెద్దతుంబళం గ్రామాల్లో మొత్తం 16 అనుమానిత కేసులు నమోదయ్యాయి.

* డోన్‌లో నిర్ధారణైనట్లు పశు సంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు.

* సెప్టెంబరు 2 నుంచి 8 వరకు ఆరు నమూనాలు సేకరించి భోపాల్‌లోని నిషాద్‌ ల్యాబ్‌కు  సెప్టెంబరు 12 నుంచి 24 వరకు సేకరించిన 10 నమూనాలు విజయవాడకు పంపించారు.

మొదట సరిహద్దు గ్రామాల్లో

* తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో టీకాలు వేయాలని నిర్ణయించాం. రాష్ట్ర సరిహద్దుల్లో అన్ని గ్రామాల్లో తెల్ల జాతి పశువులకు వ్యాక్సిన్‌ వేస్తున్నాం. అనుమానిత కేసులు వచ్చిన గ్రామాల్లోనూ పశువులకు టీకాలు వేస్తున్నట్లు కర్నూలు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.రామచంద్రయ్య పేర్కొన్నారు.

* నంద్యాల జిల్లాకు ఇప్పటివరకు 80 వేల డోసుల టీకాలు రాగా.. ప్రతి మండలంలో టీములు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 36 వేల డోసుల టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.రమణయ్య తెలిపారు.

చెక్‌పోస్టుల ఏర్పాటు

పశువుల్లో ముద్దచర్మ వ్యాధి ప్రబలుతుండటంతో ప్రభుత్వం స్పందించి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసింది. మంత్రాలయం మండలం మాధవరం, ఆదోని మండలం పెద్దహరివాణం, కౌతాళం మండలం బాపురం, హాలహర్వి మండలం చింతకుంట, కర్నూలు మండలం పంచలింగాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని