logo

వేగంగ పడిపోతోంది

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పడిపోతుండటం.. జలాశయంపై ఆధారపడిన కాల్వలకు అధికారులు నీటి సరఫరాను కుదించడంతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది.

Published : 27 Jan 2023 05:35 IST

కాల్వల పరిధిలో సాగు ప్రశ్నార్థకం

బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌

నందికొట్కూరు, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పడిపోతుండటం.. జలాశయంపై ఆధారపడిన కాల్వలకు అధికారులు నీటి సరఫరాను కుదించడంతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. కృష్ణా వెనక జలాలు తరలించేందుకు నదికి అనుసంధానంగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీనీవా సుజల స్రవంతితో పాటు పలు ఎత్తిపోతల పథకాలున్నాయి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్న సమయంలోనే ఆయా పథకాలకు నీటి విడుదల చేయడానికి వీలుంటుంది.. ప్రస్తుతం నీటి మట్టం 844 అడుగులకు చేరింది. దీంతో ఇప్పటికే కొన్ని కాల్వలకు పూర్తిగా నిలిపివేశారు. ఆయా కాల్వల పరిధిలో సాగు ప్రశ్నార్థకంగా మారనుంది.

* పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌: శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటిమట్టం ఉన్న సమయంలో 44 టీఎంసీల మిగులు జలాలు ఎస్సార్‌బీసీ, కేసీ, తెలుగుగంగ కాల్వలకు తరలించేందుకు 10 గేట్ల సామర్థ్యంతో జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు సమీపంలో దీనిని నిర్మించారు.
* తెలుగుగంగ: చెన్నైకి మంచినీరు అందించే ఉద్దేశంతో 406 కి.మీ పొడవున కాల్వ నిర్మాణం చేశారు. దీనికి అనుసంధానంగా 16.95 టీఎంసీల సామర్థ్యంతో వెలుగోడు జలాశయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాల్వ పరిధిలో నంద్యాల జిల్లాలో సుమారు 1.14 లక్షల ఎకరాల సాగు అవుతోంది.. రబీలో 80 వేల వరకు వరి సాగు చేపట్టారు.
* ఎస్సార్‌బీసీ (జీఎన్‌ఎస్‌ఎస్‌): గతంలో ఎస్సార్బీసీ (శ్రీశైలం రైట్‌ బ్రాంచి కెనాల్‌)గా పిలిచేవారు. ప్రస్తుతం నాలుగు గేట్లతో జీఎన్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి గాలేరు నగరి, అవుకు జలాశయాలకు నీరు చేరుకుంటుంది. ఈ కాల్వ కింద జిల్లాలో 1.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రబీలో 1.20 లక్షల వరకు పంటలు సాగులో ఉన్నాయి.
* కేసీ కాలువ: సుంకేసుల నుంచి 140 కి.మీ బనకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వరకు కర్నూలు- కడప కాలువ ద్వారా తుంగభద్ర నీరు ప్రవహించి కేసీ క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద కృష్ణా నీటిలో కలుస్తుంది. ఇక్కడి నుంచి నిప్పులవాగులో కలిసి గడివేముల మండలం మీదుగా కర్నూలు-కడప కాలువ ముందుకు సాగుతుంది. దీని కింద ఉమ్మడి జిల్లాలో 1.57 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని