logo

బాధితుల గోడు.. స్పందన కరవు

పింఛను మంజూరు కాలేదని కొందరు..  పొలాలు ఆక్రమించుకున్నారని మరికొందరు.. వికలాంగులైనా వికలత్వ పత్రాలు ఇవ్వలేదని ఇంకొందరు.. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చి విన్నవిస్తున్నారు.

Published : 31 Jan 2023 02:12 IST

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

పింఛను మంజూరు కాలేదని కొందరు..  పొలాలు ఆక్రమించుకున్నారని మరికొందరు.. వికలాంగులైనా వికలత్వ పత్రాలు ఇవ్వలేదని ఇంకొందరు.. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చి విన్నవిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రాలు అందజేస్తున్నారు. నెలలు గడిచినా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. పలుమార్లు వచ్చేందుకు డబ్బులు ఖర్చవుతోంది తప్ప.. న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి జనం పెద్దఎత్తున హాజరయ్యారు.  

సుగ్గికి వెళ్తే భూమి కాజేశారు

అంపయ్య, గంజిహళ్లి, గోనెగండ్ల

గ్రామంలోని సర్వే నంబరు 51 బై1లో 6.46 ఎకరాల భూమి ఉంది. వారసత్వంగా వచ్చిన 3.23 ఎకరాలు గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. బతుకుదెరువు కోసం వలస (సుగ్గి) వెళ్లాను. తమకు తెలియకుండా తలారి చిరంజీవి ఆన్‌లైన్‌ చేయించుకుని పట్టాదారు పాసు పుస్తకం తీసుకున్నారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని తమ పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహసీల్దారు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్పందనలో ఇప్పటికీ మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి న్యాయం జరగలేదు.


నాలుగేళ్లైనా.. బిల్లులు ఇవ్వరు

దస్తగిరి, మాదన్న, వెంకటేశులు, బురాన్‌దొడ్డి, సి.బెళగల్‌

త ప్రభుత్వ హయాంలో 2018-19 సంవత్సరంలో మినీ గోకులం పథకం కింద షెడ్లు నిర్మించుకున్నాం. నాలుగేళ్లవుతున్నా బిల్లులు మంజూరు చేయడం లేదు. ఒక్కొక్కరికి రూ.1.80 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్నాం. స్పందనలో పలుమార్లు అర్జీలు ఇచ్చాం.. కలెక్టర్‌కు విన్నవించుకున్నా ప్రయోజనం లేదు. పశు సంవర్ధక, డ్వామా అధికారులకు మొరపెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తే బిల్లులు ఇస్తామని చెబుతున్నారు.


కార్డులో భర్త పేరుందని పింఛన్‌ ఆపేశారు

బండారి ఆశమ్మ, లేబర్‌ కాలనీ, కర్నూలు నగరం

త 15 ఏళ్ల నుంచి ఇళ్లల్లో పనిచేస్తూ.. పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఒంటరి మహిళ కింద 2022 జులై వరకు పింఛను వచ్చింది. రేషన్‌ కార్డులో భర్త పేరుందనే కారణంతో పింఛను ఆపేశారు. ఫలితంగా కుటుంబ పోషణ భారంగా మారింది. రేషన్‌ కార్డులో భర్త పేరు తొలగించాలని సచివాలయం, నగరపాలక సంస్థ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు.


ఆదుకోవాలని వేడుకోలు

జ్యోతి, వడ్డెగేరి, కర్నూలు

నా కుమార్తె కృష్ణవేణి మానసిక వికలాంగురాలు. నగరంలోని వడ్డేగేరిలో నివాసముంటున్నాం.  నగరంలో ఓ చర్చిలో పనిచేస్తూ పిల్లలను పోసిస్తున్నా. కుమార్తెకు పింఛను మంజూరు చేయాలని  కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నా. 25-05-2019లో కృష్ణవేణికి 75 శాతం వికలత్వంతో ధ్రువీకరణ పత్రం మంజూరు చేసినా పింఛను ఇవ్వలేదు. ప్రస్తుతం ఇచ్చిన సదరమ్‌ ధ్రువపత్రాన్ని రద్దు చేసి కొత్తగా వికలత్వ ధ్రువీకరణ పత్రం ఇచ్చి పింఛను మంజూరు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని