logo

కదలని దస్త్రం.. వీడని వివాదం

భూ వివాదాల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం జాప్యం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. రెవెన్యూ కోర్టులను ఆశ్రయిస్తే ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి.

Published : 30 May 2023 02:56 IST

అధికారుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : భూ వివాదాల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం జాప్యం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. రెవెన్యూ కోర్టులను ఆశ్రయిస్తే ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి. కొందరు అధికారులు పూర్తిస్థాయిలో దస్త్రాలు అందించకపోవడమే కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ల నుంచి వచ్చే నివేదికలే ఈ కేసుల్లో కీలకం. ప్రతి తహసీల్దారు కార్యాలయంలో ఏ1 రిజిస్టర్‌, అడంగల్‌, 1బి ఖాతాకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుంది. కొందరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో బాధితులు కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

నివేదికల్లో లోపాలు

* ఆర్‌వోఆర్‌లో తప్పుగా నమోదైందని.. కుటుంబ సభ్యుల మధ్య భూ తగాదాలు, సర్వే నంబర్లలో సమస్యలు, విస్తీర్ణంలో తేడాలు, తమ భూమిని ఆన్‌లైన్‌ అడంగల్‌లో నమోదు చేయలేదని.. ఇతరులు ఆక్రమించుకున్నారని తదితర వినతులు వస్తుంటాయి. తమ వద్ద ఉన్న దస్త్రాలను పరిశీలించి కచ్చితమైన నివేదికలు ఇస్తే రెవెన్యూ కోర్టుల్లోని కేసులు త్వరగా పరిష్కృతమవుతాయి. వారు తాత్సారం చేయడంతో చాలా కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

* కొన్ని భూవివాదాల కేసులు సీసీఎల్‌ఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి అబాలిషన్‌ చట్టం రాకముందు ఉన్న రికార్డులు సమర్పించాలని సూచించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు.

* తహసీల్దార్లు ఇచ్చిన తీర్పులపై కొందరు ఆర్డీవో, ఆపై జేసీ, సీసీఎల్‌ఏ కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కొన్ని రెవెన్యూ కేసుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒకసారి ఒక నివేదిక ఇస్తే.. ఆ అధికారి బదిలీ అయిన తర్వాత మళ్లీ నివేదిక తెప్పించుకుంటే మరోలా ఉంటోందన్న వాదనలున్నాయి.

కనికరించని అధికారులు

కల్లూరు మండలం ఎ.గోకులపాడుకు చెందిన వెంకటగారి వెంకటేశ్వర్లు మూడేళ్ల కిందట చనిపోయారు. తండ్రి నుంచి వారసత్వంగా కుమార్తె వెంకటలక్ష్మికి 7.50 ఎకరాలు రావాల్సి ఉంది. సదరు భూమిని సాగు చేయనీయకుండా దాయాదులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి భూతగాదాలు లేవు.. కోర్టు కేసులు లేవు. పట్టాదారైన వెంకటలక్ష్మి మూడేళ్ల నుంచి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దారు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తండ్రి నుంచి సంక్రమించే భూమి కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా అటు పోలీసులు.. ఇటు రెవెన్యూ యంత్రాంగం కనికరం చూపడం లేదు.

రూ.1.50 లక్షల ఖర్చు

కోడుమూరు మండలం కొండాపురంలో సర్వే నంబరు 784-బిలో 76 సెంట్ల భూమి ఉంది. పెద్ద కోట్లన్న కుమారుడు పెద్ద నగేష్‌, ఆయన కుమారుడు బోయ అయ్యస్వామికి వారసత్వంగా 19 సెంట్ల భూమి రావాల్సి ఉంది. ఈ సర్వే నంబరుతో సంబంధం లేని వ్యక్తులకు రెవెన్యూ అధికారులు సదరు భూమిని ఆన్‌లైన్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఆర్‌, మ్యానువల్‌ అడంగల్‌, ఆర్‌హెచ్‌, రిజిస్ట్రేషన్‌ పత్రాలన్నీ అయ్యస్వామి పేరున ఉన్నాయి. వారసత్వంగా 2021 నుంచి సంక్రమించిన భూ దస్త్రాలతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సదరు భూమిని ఆన్‌లైన్‌ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇరువురిని పిలిపించి ఆర్టీవో భూ సమస్య పరిష్కరించాలి. ఆన్‌లైన్‌ చేయించుకున్న వ్యక్తుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా రెండు నెలలుగా ఆర్డీవో ఫైనల్‌ ఆర్డర్‌ ఇవ్వడం లేదు. చివరికి లోకాయుక్తను ఆశ్రయించారు.. కోర్టుల చుట్టూ తిరిగేందుకు ఇప్పటి వరకు రూ.1.50 లక్షల ఖర్చైందని బాధితుడు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.

అధికార పెత్తనం

బేతంచెర్ల మండలం సీతారామపురం పరిధిలో సర్వే నంబరు 723లో ఎస్‌.సుంకన్న కుటుంబీకులకు 9.60 ఎకరాలు ఉండేది. 30 ఏళ్ల కిందట 5.40 ఎకరాలు భూసేకరణలో పోయింది. మిగిలిన 4.20 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన తెదేపా వర్గీయుడంటూ ఉద్దేశపూర్వకంగా అధికారపార్టీ వారు ఆ భూమిని 2019లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు భూమిని తీసుకునేలా ప్రయత్నాలు చేయగా సుంకన్న హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితుడికి భూ హద్దులు చూపి పాసు పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ భూమి వివాదాస్పదంగా ఉందంటూ రెవెన్యూ అధికారులు హైకోర్టుకే తప్పుడు నివేదికలు ఇచ్చారు. బాధితుడు మరోమారు కోర్టు ధిక్కారం కేసు వేశారు.. లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రస్తుత రెవెన్యూ అధికారులు పూర్వ అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చేందుకు బాధితుడిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష వరకు ఖర్చు చేసినా భూ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని