logo

ఆగిన రిజిస్ట్రేషన్లు.. నిరీక్షించిన జనం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

Published : 30 May 2023 02:56 IST

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, గూడూరు న్యూస్‌టుడే : సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లతోపాటు ఈసీ.. ఇతరత్రా ఆన్‌లైన్‌కు సంబంధించిన సేవలన్నీ ఆగిపోవడం గమనార్హం. సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు. సమస్యను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో వారు పరిశీలిస్తున్నారు.

రుసుములు పెరుగుతాయని

జూన్‌ ఒకటో తేదీ నుంచి భూములు, స్థలాల విలువలను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో పరోక్షంగా రిజిస్ట్రేషన్‌ రుసుములు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఫలితంగా పలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు జనంతో కిటకిటలాడాయి. మరోవైపు సర్వర్‌ మొరాయింపు సమస్య కారణంగా సేవలు ఆగిపోవడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. సాయంత్రం వరకు జనం పడిగాపులు కాసి వెనుదిరిగారు. సమస్య పరిష్కారమవుతుందని పలువురు గంటల తరబడి వేచి చూసినా ప్రయోజనం లేకపోయింది.

ఆదాయానికి ఆటంకం

జిల్లా కేంద్రంలోని కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఈనెలాఖరు వరకు ఇదే సమస్య కొనసాగుతుందేమోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రతిరోజూ 500 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రోజూ రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతుంది. రిజిస్ట్రేషన్లు జరగకపోవటంతో ప్రభుత్వ ఆదాయానికి బ్రేక్‌ పడింది. జనం భారీగా గుమికూడటంతో మంగళవారం నుంచి సర్వర్‌ పనిచేయొచ్చంటూ అధికారులు సర్ది చెప్పి పంపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని