logo

తెదేపా గెలుపే లక్ష్యంగా పనిచేస్తా

కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా తెదేపా అధినేత చంద్రబాబు  తనను నియమించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానంలో తెదేపా, భాజపా అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని తిక్కారెడ్డి అన్నారు.

Published : 16 Apr 2024 06:25 IST

కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి

కార్యక్రమంలో మాట్లాడుతున్న పాలకుర్తి తిక్కారెడ్డి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా తెదేపా అధినేత చంద్రబాబు  తనను నియమించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానంలో తెదేపా, భాజపా అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్‌ ఎన్నికల సమన్వయకర్త, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్‌, కర్నూలు పార్లమెంట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర తదితరుల సమక్షంలో ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. పలువురు నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో నికార్సయిన తెదేపా కార్యకర్తగా పనిచేస్తూ వచ్చానని తిక్కారెడ్డి తెలిపారు. 20 ఏళ్లకు పైగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సోమిశెట్టి సూచనలు పాటిస్తూ, ఎన్నికల పరిశీలకుడు బీటీ నాయుడుతో సమన్వయం చేసుకుంటూ అన్ని స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జిల్లా సీనియర్‌ నేతలు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్‌, కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి సలహాలు, సూచనలతో ముందుకెళ్తామన్నారు. నామినేషన్లు వేసిన తర్వాత ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైకాపా గెలుపొందినా కనీసం తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కరెంటు బిల్లులు పెంచమని చెప్పారని.. మరి ఎన్నిసార్లు బిల్లులు పెంచారో లెక్కే లేదని అన్నారు. జె బ్రాండ్‌ లిక్కర్‌ తాగి వందలాది మంది చనిపోయాగా.. వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారన్నారు. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు తెదేపా సూపర్‌-6 పథకాలను ప్రజలకు వివరించడం, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేసి జిల్లాలోని అన్ని స్థానాల్లో తెదేపా జెండా ఎగురవేస్తామన్నారు. పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కేవీ సుబ్బారెడ్డి, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కేఈ జగదీష్‌, కర్నూలు పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌, కార్పొరేటర్‌ పద్మలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అందరి సహకారం మరువలేనిది : కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా ఇప్పటివరకు పనిచేసిన తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతగానో సహకరించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బాధ్యతలు అప్పగించారని, వారి మేలు మరిచిపోలేనిదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని