logo

పేదలపై జగన్‌ ‘కూర’త్వం

‘‘ రైతు బజారుకెళ్లిన సుజాతమ్మ పది రకాల కూరగాయలు కొనుగోలు చేశారు.. రూ.500 నోటు వ్యాపారికి ఇచ్చారు.. మరో రూ.పది ఇవ్వాలనడంతో ఆమె గుండె ‘ధర’దడలాడింది. రూ.500 ఇస్తే ఐదుగురు కుటుంబ సభ్యులున్న తమకు వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి.. ప్రస్తుతం మూడ్రోజులకు సరిపోవడం లేదు..

Published : 16 Apr 2024 06:39 IST

తగ్గిన కూరగాయల సాగు
రాయితీలకు మంగళం పాడిన సర్కారు
గత ఐదేళ్లలో భారీగా పెరిగిన ధరలు
కర్నూలు మార్కెట్‌ న్యూస్‌టుడే

‘‘ రైతు బజారుకెళ్లిన సుజాతమ్మ పది రకాల కూరగాయలు కొనుగోలు చేశారు.. రూ.500 నోటు వ్యాపారికి ఇచ్చారు.. మరో రూ.పది ఇవ్వాలనడంతో ఆమె గుండె ‘ధర’దడలాడింది. రూ.500 ఇస్తే ఐదుగురు కుటుంబ సభ్యులున్న తమకు వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి.. ప్రస్తుతం మూడ్రోజులకు సరిపోవడం లేదు.. కిలో కొనాల్సినవి అర కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట.. కొండెక్కిన కూరగాయల ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు. నాలుగైదు నెలల కిందట ధరలతో పోలిస్తే కూరగాయలు, సరకుల బిల్లు నెలకు రూ.వెయ్యికిపైగా పెరిగిందని పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.’’

10 లక్షల హెక్టార్ల సారవంతమైన నేలలు.. 7.40 లక్షల సమర్థులైన రైతులు ఉన్నారు.. విదేశాలకు ‘సోనా’ బియ్యం ఎగుమతి చేసిన ఖ్యాతి.. అలాంటి సీమ ముఖద్వారంలో ఈ నాలుగున్నరేళ్లలో కూరగాయల సాగు తగ్గింది.. దశాబ్దం కిందట 5 వేల హెక్టార్లకుపైగా సాగవగా ప్రస్తుతం 2 వేల హెక్టార్లకు మించడం లేదు. సరిపడా కూరగాయల సాగు లేకపోవడంతో పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కారణం.. కూరగాయల సాగుకు జగనన్న సర్కారు చూపిన మొండిచెయ్యి.!! ఇదే అవకాశంగా వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.84 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ధరల పెరుగుదల వీరిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఏటా రూ.6.91 కోట్ల భారం

ఐదేళ్ల కిందటి కూరగాయల ధరలు పోలిస్తే కిలోపై రూ.10 నుంచి రూ.70 వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఒక్కో కుటుంబం రోజుకు కిలో చొప్పున అన్నిరకాల కాయగూరల వినియోగం జరుగుతుండగా.. సరాసరి కిలోకు రూ.60 వెచ్చించాల్సి వస్తోంది. ఐదేళ్ల కిందట రూ.30-40 ఉండగా ప్రస్తుతం ధరలు రెట్టింపయ్యాయి. జిల్లాలో రోజువారీగా 640 టన్నుల కొరత ఉంది. ఈ లెక్కన పెరిగిన ధరలతో పోలిస్తే వినియోగదారులపై రోజువారీగా రూ.1.92 లక్షలు.. నెలకు రూ.57.60 లక్షల భారం పడుతోంది.  ఫలితంగా ఉమ్మడి జిల్లా ప్రజలు కూరగాయలపై ఏటా రూ.6.91 కోట్ల అదనంగా వెచ్చించాల్సి వస్తోంది.

ఉల్లి లొల్లి.. టమాట లేదు

  • ఉల్లి సాగులో రాష్ట్రంలోనే కర్నూలు ప్రథమ స్థానంలో ఉంది. దశాబ్దం కిందట ఏటా 36 వేల హెక్టార్లలో సాగవ్వగా 2023-24లో 21,701.4 హెక్టార్లకు పడిపోయింది.
  • ధర ఉన్నప్పుడు పంట ఉండదు.. పంట పండినప్పుడు గిట్టుబాటు ధర లభించదు.. జిల్లాలో టమాట రైతుల పరిస్థితి ఇలానే మారింది. ఒకప్పుడు పది వేల హెక్టార్లలో సాగయ్యేది.. ప్రస్తుతం 7 వేల హెక్టార్లకు పడిపోయింది. ప్రస్తుతం మదనపల్లి, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాల నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి.
  • పచ్చిమిర్చి పూర్తిగా పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 3,500 హెక్టార్లు కూడా సాగవడం లేదు. ప్రస్తుతం కిలో రూ.50-70 పలుకుతోంది. పచ్చిమిర్చి పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఫలితంగా రవాణా, ఇతరత్రా ఖర్చులతో కలిపి కిలోపై రూ.10-20 మేర వ్యాపారులు ధర పెంచేసి విక్రయిస్తున్నారు.

మేలు చేసిన తెదేపా

తెదేపా ప్రభుత్వ హయాంలో కూరగాయల రైతులకు భారీగా రాయితీలు లభించేవి. హైబ్రీడ్‌ కూరగాయల విత్తనాలకు సంబంధించి ఒక్కో రైతుకు రూ.3 వేల విలువ చేసే విత్తన రాయితీలు, సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు హెక్టారుకు రూ.20 వేలు ఇచ్చేది. శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేసేందుకు ఎకరానికి రూ.2 లక్షల యూనిట్‌ వ్యయం కాగా.. అందులో 50 శాతం రాయితీ లభించేది. మల్చింగ్‌ పద్ధతిలో కూరగాయల సాగుకు హెక్టారుకు యూనిట్‌ వ్యయం రూ.32 వేలు కాగా.. అందులో 50 శాతం (రూ.16 వేలు) రాయితీ వచ్చేది. కోల్డ్‌ రూమ్‌ల ఏర్పాటుకు ఒక యూనిట్‌ వ్యయం రూ.12 లక్షలు కాగా అందులో రూ.9 లక్షలు రాయితీ లభించేది. కూరగాయల కలెక్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.15 లక్షల వ్యయం కాగా అందులో 75 శాతం (రూ.11.75 లక్షలు) రాయితీ ఉంది.

నిధులివ్వని వైకాపా

ఉద్యాన, కాయగూరలు సాగు చేసే రైతులకు వైకాపా ప్రభుత్వం రాయితీలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్‌ కింద రూ.12.84 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద రూ.2.04 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏడాది గడిచిపోయినా.. ఆర్థిక సంవత్సరం ముగిసినా నిధులు విడుదల కాలేదు. ఒక్క రైతుకు రాయితీ అందలేదు. హైబ్రీడ్‌ విత్తనాలు కొనుక్కోలేక  సాగు తగ్గించుకుంటున్నారు.

అవసరం 1,000 టన్నులు.. ఉత్పత్తి 360 టన్నులు

  • ఏడాది కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 రకాల కూరగాయల పంటలు కలిపి 1,826.2 హెక్టార్లలో సాగవుతున్నాయి. 31,962.2 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అవుతోంది.
  • ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఒక కుటుంబం నిత్యం కిలో కూరగాయలు వినియోగిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు నిత్యం వెయ్యి టన్నుల వరకు కూరగాయలు అవసరమవుతాయి.
  • ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల కూరగాయలు కలిపి 1,29,687 టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. నెలకు 10,807 మెట్రిక్‌ టన్నులు అవసరం.. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా పంట లేదు. 640 టన్నుల కొరత ఉంది. వాటిని పక్క జిల్లా, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

జనాభా: 42.22 లక్షలు
కుటుంబాలు: 13.31 లక్షలు
రోజుకు అవసరం: 250 గ్రాములు
నిత్యం అవసరం: 1,000 టన్నులు
నిత్యం ఉత్పత్తి: 360 టన్నులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని