logo

రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికలకు సంబంధించి నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

Published : 17 Apr 2024 03:02 IST

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికలకు సంబంధించి నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈనెల 18న ప్రకటన విడుదల కానుంది. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 25వ తేదీ వరకు నామపత్రాలు సమర్పించేందుకు గడువు ఉంది. ప్రభుత్వ కార్యాలయ పనివేళల్లో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు అభ్యర్థులు తమ నామపత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందించాల్సి ఉంది. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించరు.

ఆన్‌లైన్‌లోనూ స్వీకరణ

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు సమర్పించే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ కల్పించింది. సువిధ పోర్టల్‌లో ఈ.అఫిడవిట్‌ ద్వారా నామినేషన్లు, ఆన్‌లైన్‌లోనే డిపాజిట్‌ మొత్తం చెల్లించేలా వీలు కల్పించారు. ఆన్‌లైన్‌లో నామపత్రాలు సమర్పించినప్పటికీ ఆ పత్రాలను ఫిజికల్‌గా ఆర్వోకు అందజేయాల్సి ఉంటుంది.

25 తర్వాత తుది ఓటరు జాబితా ప్రకటన

ఓటరు నమోదు ప్రక్రియ సోమవారంతో ముగిసిన నేపథ్యంలో ఈనెల 25 తర్వాత తుది ఓటరు జాబితాల ప్రచురించనున్నారు. తుది ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

2,204 పోలింగ్‌ కేంద్రాలు

సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు అధికారులు సిద్ధమవుతున్నారు.. ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు..  ఈ నెల 18న జిల్లా రిటర్నింగ్‌ అధికారి ప్రకటన జారీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో గతేడాది జనవరి 5వ తేదీ నాటికి 8 నియోజకవర్గాల్లో 2,186 పోలింగ్‌ కేంద్రాలుండగా.. అదనంగా పాణ్యంలో 17, ఎమ్మిగనూరులో ఒకటి కలిపి మరో 18 కేంద్రాలు పెరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,204కు చేరింది. కర్నూలులో 258, పాణ్యం 357, పత్తికొండ 255, కోడుమూరు 275, ఎమ్మిగనూరు 272, మంత్రాలయం 237, ఆదోని 256, ఆలూరులో 294 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.


విధుల్లో 15,869 మంది సిబ్బంది

ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 8 నియోజకవర్గాలకు 213 మంది సెక్టోరల్‌ అధికారులను నియమించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి ఎంసీసీ బృందాలు 35, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ (ఎఫ్‌ఎస్‌టీ) బృందాలు 64, స్టాటస్టికల్‌ సర్వేలెన్స్‌ (ఎస్‌ఎస్‌టీ) బృందాలు 78, వీఎస్‌టీ బృందాలు 11, వీడియో వీవింగ్‌ బృందాలు 10, అకౌంటింగ్‌ బృందాలు 09, సహాయ ఎన్నికల వ్యయ అబ్జర్వర్లు 12 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి పీవో, ఏపీవో, నలుగురు ఓపీవోలు కలిపి ఆరుగురు అవసరం కాగా.. జిల్లాలోని మొత్తం పోలింగ్‌ కేంద్రాలకు 13,224 మంది సిబ్బంది అవసరం. 20 శాతం రిజర్వులో కలిపి మొత్తం 15,869 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారు.


వృద్ధ ఓటర్లు 10,005 మంది

  • 85 ఏళ్లకు పైబడిన వృద్ధ ఓటర్లలో పురుషులు 3,632, మహిళలు 6,373 మంది కలిపి మొత్తం 10,005 మంది ఉన్నారు. ఆదోనిలో అత్యధికంగా 2,307 మంది ఉండగా ఆలూరు 1,478, కోడుమూరు 1,407, పాణ్యం 1,385, కర్నూలు 978, పత్తికొండ 955, మంత్రాలయంలో 662 మంది ఓటర్లుగా ఉన్నారు. 80-85 ఏళ్లలోపు 14,356 మంది ఓటర్లకు ఇంటి వద్దే ఓటేసేందుకు అవకాశం కల్పించేందుకు అధికార యంత్రాంగానికి భారమవుతుందనే ఉద్దేశంతో 85 ఏళ్లకు పైబడినవారు మాత్రమే ఇంటి దగ్గరే ఓటేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది.
  • శారీరక దివ్యాంగులు, వయో వృద్ధ ఓటర్లు ఇంటి నుంచి ఓటేయడంపై ఇప్పటికే బీఎల్వోలు సర్వే చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వారిని గుర్తించి వారికి ఫారం-12 దరఖాస్తులు అందించనున్నారు.  
  • హోమ్‌ ఓటింగ్‌కు సంబంధించి ఏప్రిల్‌ 18 నుంచి 21వ తేదీ వరకు బీఎల్వోల ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. హోమ్‌ ఓటింగ్‌కు అవసరమైన వారిని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) గుర్తిస్తారు. హోమ్‌ ఓటింగ్‌కు గుర్తించిన వారికి తమ ఇంటి వద్దే ఓటేసే సదుపాయం అధికారులు కల్పించనున్నారు.

23,827 మంది దివ్యాంగ ఓటర్లు

జిల్లాలో 23,827 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. కర్నూలులో 2,227, పాణ్యం 3,392, పత్తికొండ 2,528 కోడుమూరు 3,509, ఎమ్మిగనూరు 3,182, మంత్రాలయం 2,944, ఆదోని 2,430, ఆలూరులో 3,615 మంది ఉన్నారు. వీరిలో శారీరక వికలత్వంతో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటేయలేని వారికి ఇంటి వద్దే ఓటేసే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని