logo

ఉద్యోగుల పింఛన్‌.. జగన్‌ వంచించెన్‌

పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్‌) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు.

Published : 19 Apr 2024 02:54 IST

పాత విధానంపైనే అందరి ఆసక్తి
సీపీఎస్‌ రద్దు ఊసేది

పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్‌) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. కానీ తీరా ఆ మాటే మరిచారని కొత్త పథకానికి ఆమోదం తెలుపుతూ.. మోసం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత నెలకొంది. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్రంగా మోసం చేశారు. జగన్‌ వంచనపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు తప్పని కష్టాలు

- వి.సురేశ్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని వాగ్దానం చేస్తానన్న మాటలు నమ్మి.. సీపీఎస్‌ ఉద్యోగులు మోసం పోయారు. ఈ విధానాన్ని రద్దు చేయకపోగా.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం ఏకపక్షంగా గ్యారంటెడ్‌ పింఛను పథకం ప్రవేశపెట్టింది. దానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలు పదవీ విరమణ తర్వాత రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇలాంటి అనాలోచిత చర్యలతో ఉద్యోగులను వేధించడం సరికాదు.


పది శాతం చెల్లిస్తున్నారు..

- సురేష్‌, సీపీఎస్‌ ఉద్యోగి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం కింద ప్రతి ఉద్యోగికి 14శాతం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. తమకు మాత్రం కేవలం 10శాతం మాత్రమే అందిస్తున్నారు. వీటిని సైతం ప్రతి నెలా చెల్లించాలి. 8 నెలలుగా నిధులు కేటాయించకపోవడంతో నష్టపోతున్నాం. ప్రతి నెలా మంజూరు చేయకపోవడంతో వాటిపై వచ్చే వడ్డీని కోల్పోతున్నాం. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్లు పూర్తవుతున్నా వాటిని అమలుచేయలేదు.


సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి..

- సి.నాగరాజు, ఎస్టీయూ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించారు. సీపీఎస్‌ విధానానికి బదులుగా జీపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తానన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు సైతం సరిగా చెప్పడంలేదు. ఇది ఉద్యోగులకు తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఎవరు.. ఏ పింఛను పథకం పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి. ఇందులో చాలా సందేహాలు ఉన్నాయి. వాటి స్పష్టతనివ్వాలి.


మాట మరిచారు..

- నాగరాజు, సీపీఎస్‌ ఉద్యోగి, ఆలూరు

ఆలూరు, న్యూస్‌టుడే: అధికారంలో వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తానని 2019 ఎన్నికల ముందు జగన్‌ బహిరంగగానే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు కొనసాగినా నేటికీ ఆ మాట నెరవేర్చలేకపోయారు. రద్దు చేయలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్‌ మాట ఇవ్వడమే కానీ.. అమలు చేయలేకపోతున్నారు. సీపీఎస్‌ రద్దు కోసం ఈ ఐదేళ్లలో ఎన్నో సార్లు ఆందోళన చేపట్టారు. అయినా ఎలాంటి స్పందన లేదు. సీపీఎస్‌ రద్దు చేయలేకపోవడమే కాకుండా డీఏలు, ఇతర వాటిని సక్రమంగా అందించలేకపోయారు. కొన్ని సార్లు వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.


నమ్మించి వంచించారు

- ఆస్పరి సాయిబాబా, ఎన్జీవోల సంఘం తాలూకా అధ్యక్షుడు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా.. సీపీఎస్‌ రద్దుపై నోరు మెదపకపోవడం బాధాకరం. అంతేకాక జీఎపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఉద్యోగులకిచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోగా.. నమ్మించి మోసం చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించారు. పీఆర్సీ ద్వారా ప్రతి ఉద్యోగికి పెరగాల్సిన వేతనాలు, అనూహ్యంగా తగ్గించేశారు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగులను, సంఘాల నేతలను అన్ని విధాలా అణిచివేసి ఆవేదనకు గురిచేశారు. జగన్‌ ప్రభుత్వం చేసిన మోసానికి ప్రతి ఉద్యోగి కుటుంబం మానసింగా కుంగిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని