logo

మల్లన్న గడపన ‘కడప’ పెత్తనం

భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్‌ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు.

Updated : 05 May 2024 04:53 IST

దేవాలయ వ్యవహారాల్లో జోక్యం

భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్‌ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అవినీతి, అక్రమాలను పెంచి పోషించారు. భక్తుల సేవ ముసుగులో భారీగా లబ్ధి పొందారు. ఎక్కడి…కక్కడ దేవాలయ వ్యవహారాలను ఏదో ఒకవిధంగా వివాదాస్పదం చేసి భక్తజన విశ్వాసాలతో ఆడుకున్నారు. శ్రీశైలం క్యూకాంప్లెక్స్‌, సాలు మండపాల నిర్మాణానికి నిరుడు పిలిచిన టెండర్లను సకల శాఖల మంత్రిగా పేరొందిన జగన్‌ ప్రభుత్వ సలహాదారు రద్దు చేయించారు. రూ.110 కోట్ల విలువైన ఆ పనులు తనకు సన్నిహితులైన గుత్తేదారులకు దక్కే అవకాశం లేదన్న దుగ్ధతోనే ఆయన అందుకు తెగబడ్డారు.

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే

అస్మదీయుడికి ఆలయ బాధ్యతలు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కడపలో వైకాపా నేతలకు అనుకూలంగా పని చేసిన అధికారి ఈవోగా వాలిపోయారు. కడప మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.లవన్నను 2021 ఆగస్టు 20న శ్రీశైల దేవస్థానం ఈవోగా ప్రభుత్వం నియమించింది. కడప, చిత్తూరు ప్రజాప్రతినిధుల అండదండలతో లవన్న రెండేళ్ల పాటు ఈవోగా పని చేశారు. ఆయన పాలనంతా ఆధిపత్యం, అక్రమాలతో చలామణి అయ్యారని బహిరంగ విమర్శలు ఉన్నాయి. బదిలీ అయినాసరే విధుల నుంచి రిలీవ్‌ కాకుండా, సీఎస్‌ ఉత్తర్వులను బేఖాతరు చేసి 20 రోజులు అదనంగా పని చేశారు. దేవస్థానానికి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని ఈవోగా నియమించాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ ర్యాంక్‌కే పరిమితం చేసింది.

బదిలీలు, పదోన్నతుల జాతర

వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత దేవాదాయశాఖలో ఉద్యోగులను సాధారణ బదిలీలు చేశారు. శ్రీశైల దేవస్థానం నుంచి 50 మందికి పైగా స్థాన చలనం కలిగించారు. మూడు నెలలు గడవక ముందే ఉద్యోగులను డిప్యుటేషన్‌ పద్ధతిలో అధికార పార్టీ నేతలు సొంత గూటికి తీసుకొచ్చారు. ఎన్నికలు సమీపించే ముందు హడావుడిగా దేవాదాయశాఖ ఏసీ, డీసీలకు మంత్రి కొట్టు సత్యనారాయణ పదోన్నతి కల్పించారు. ఏసీ చంద్రశేఖర్‌రెడ్డి శ్రీశైలానికి బదిలీ అయినా విధుల్లో చేరలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ దేవస్థానానికి డిప్యూటీ కార్యనిర్వహణాకారిగా రమణమ్మను నియమించారు. డీఈవోను నియమించారు తప్ప ఆమె నిర్వర్తించాల్సిన విధులపై దేవాదాయశాఖ నుంచి స్పష్టత రాలేదు. దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ దేవాదాయశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు.

ధరలు పెంచి ఏటా రూ.5 కోట్ల దోపిడీ

పడితరం స్టోర్‌లో అక్రమాలు వెలుగు చూశాయి. అధిక ధరలు చెల్లించడంతో నెలకు రూ.42 లక్షలు సొమ్ము అదనంగా చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాది కాలానికి రూ.5 కోట్లు గండి పడుతోంది. దేవస్థానం వందల క్వింటాళ్ల చొప్పున జీడిపప్పు కొనుగోలు చేస్తున్నందున మార్కెట్ ధరల కంటే ఎక్కువ మొత్తం చెల్లించారు. టెండర్‌ గడువు ముగిసిన తర్వాత సరకుల నాణ్యత పరీక్షించడానికి ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామన్న మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్‌ హామీలు అమలు కాలేదు. అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలోని పడితరం విభాగంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.నిగ్గు తేల్చడానికి ఈఈ బాలమురళీకృష్ణను విచారణాధికారిగా నియమించి చేతులు దులిపేసుకున్నారు.

నెయ్యి కొనుగోలులోనూ వివాదమే

నంద్యాల పాల ఉత్పత్తుల సహకార సంస్థ విజయ డెయిరీ నుంచి కొన్నేళ్ల నుంచి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఈ నెయ్యి ద్వారా లడ్డూ ప్రసాదాలు తయారు చేసేవారు. వైకాపా పాలనలో విజయ డెయిరీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈవో లవన్న విజయ డెయిరీని కాదని నెల్లూరుకు చెందిన డెయిరీ ద్వారా నెయ్యి కొనుగోలు చేశారు. సదరు నెయ్యి నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని క్యాన్లకు బ్యాచ్‌ నంబర్లు లేకుండా నెయ్యి సరఫరా కావడం అనుమానాలకు తావిచ్చింది.

క్యూలైన్లలో కష్టాలను పట్టించుకోలేదు

మూడేళ్ల నుంచి క్యూలైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈవోగా భరత్‌గుప్తా ఉన్నప్పుడు రూ.5 వేల గర్భాలయ అభిషేకం టికెట్‌ ప్రవేశపెట్టారు. ఈ టికెట్‌ తీసుకున్న భక్తులను గేట్ నం.2 (హరిహరరాయ గోపురం) నుంచి అనుమతించే వారు. లవన్న ఈవోగా వచ్చిన తర్వాత ఆ మార్గం నుంచి భక్తులను అనుమతించడం ఆపేశారు. రూ.5 వేలు, రూ.1500 అభిషేకం టికెట్లు తీసుకున్న వారిని డొనేషన్‌ కౌంటర్‌ నుంచి ఒకే క్యూలైన్‌ ద్వారా అనుమతించడం మొదలుపెట్టారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం భక్తులను కూడా ఈ గేట్ నుంచే పంపించేవారు. ఈ విధానంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను భక్తులు నిలదీసి క్యూలైన్ల నిర్వహణ అధ్వానంగా ఉందని మండిపడ్డారు.

సత్రాల్లో చొరబాట్లు

శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సేవలు చేయడానికి వివిధ సంఘాలు ఆసక్తి చూపిస్తుంటాయి. సంఘాల తరఫున 50 సెంట్ల స్థలం మంజూరు చేయించుకొని భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటు ధార్మిక చింతన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని తలపోస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారికే సత్రాలు, ఆశ్రమాలకు స్థలాలు మంజూరు చేశారు. పెద్దల అండదండలు ఉన్న వారికి రింగ్‌రోడ్డు లోపల, అంతగా పలుకుబడి లేని వారికి బయట స్థలాలు కేటాయించారు. స్థలాల కేటాయింపులు, సత్రాల నిర్మాణాల్లో వైకాపా నేతలు చక్రం తిప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని