logo

భూపత్రం.. జగన్‌ కుతంత్రం

‘‘దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించాం.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. డ్రోన్ల సాయంతో ప్రతి క్షేత్రం, పొలం చిత్రపటాలు తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా.. భూ విస్తీర్ణంలో తేడాలు లేకుండా రైతులకు కచ్చితమైన కొలతలు వేయించి, రీసర్వే చేయించి శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తున్నట్లు’’ జగన్‌ పదేపదే చెబుతున్నారు.

Updated : 06 May 2024 06:32 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై రైతుల ఆందోళన
ప్రజా ఆస్తులకు భద్రత లేనట్లే అంటున్న న్యాయవాదులు

‘‘దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించాం.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. డ్రోన్ల సాయంతో ప్రతి క్షేత్రం, పొలం చిత్రపటాలు తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా.. భూ విస్తీర్ణంలో తేడాలు లేకుండా రైతులకు కచ్చితమైన కొలతలు వేయించి, రీసర్వే చేయించి శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తున్నట్లు’’ జగన్‌ పదేపదే చెబుతున్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఎక్కడికక్కడ వివాదాలు రాజేసి భూములు దోచుకొనే ప్రణాళికలా ఉంది.. ఇప్పటికే అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూయాజమాన్య హక్కు చట్టం (ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్‌్్ట)-2023ను క్షుణ్నంగా పరిశీలిస్తే జనం భూములన్నీ జగన్‌ చేతుల్లోకెళ్లినట్లేనని విశ్రాంత రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

కొలత.. కోత

పొలాలు సర్వే చేసిన అధికారులు పలువురు రైతులకు విస్తీర్ణం తక్కువగా చూపుతున్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూముల దస్త్రాలు పరిశీలిద్దామని కొందరు రైతులు 1బీ పత్రం కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నించినా రావడం లేదు. దీంతో కొందరు అనుమానంతో మీ భూమి పత్రాన్ని ఆన్‌లైన్‌లో చూసుకున్నారు. ఆన్‌లోన్‌లో పరిశీలిస్తే ఎకరాకు సెంటు నుంచి అర ఎకరా, కొన్నిచోట్ల ఎకరం వరకు తగ్గినట్లు చూపుతోంది. కొంతమందికి ఎకరా భూమి ఉంటే ఐదారు ఎకరాలు చూపిస్తోంది. కొందరికైతే అసలు భూమే లేనట్లు ఉండటం గమనార్హం.

‘‘ గత నెల ఒకటి నుంచి బ్యాంకుల్లో పంట రుణాల నవీకరణ (రెన్యువల్‌) పనులు ప్రారంభమయ్యాయి. బ్యాంకులో రుణాల నవీకరణ చేయించుకోవాలంటే 1బీ పత్రం తప్పనిసరి. ఈ పత్రంలో ఉన్న భూముల వివరాలు పరిశీలించాకే బ్యాంకు అధికారులు రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. ఇందులో ఏమాత్రం భూముల వివరాలు తప్పుగా ఉన్నా తీసుకున్న రుణంతోపాటు వడ్డీ తిరిగి చెల్లించాల్సిందే. 1బీ పత్రం ఆన్‌లైన్‌లో రావడం లేదు. ’’  

సర్వే నంబర్లు మాయం

భూముల రీసర్వే రైతులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. భూములకు పునాదులుగా ఉన్న ఆర్‌ఎస్‌ఆర్‌ కనుమరుగవుతుంది. ఉమ్మడి జిల్లాలో 5-6 లక్షల ఎఫ్‌ఎంబీలు లేవు. సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)లను తీసుకొచ్చారు. సర్వే నంబర్‌ అయితే ఒక వ్యక్తికి ఒక్కటే ఉంటుంది.. ఆయన వారసులకూ అదే వర్తిస్తుంది. రీసర్వే తర్వాత ఐదారుగురికి కలిపి ఒక ఎల్‌పీఎం నంబరు కేటాయించి భూ హక్కు పత్రాలు అందజేస్తున్నారు. మూడు విడతల్లో కలిపి 66,508 మంది రైతులకు పత్రాలు అందించారు. ఇందులో ఏడు వేల మంది వరకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇచ్చారు. ఇలా చేయడంతో పల్లెల్లో భూ వివాదాలు పెరిగాయి.

నిరూపణ.. నిరీక్షణ

గతంలో వ్యక్తిగతంగా రైతులకు పాసు పుస్తకాలు ఇచ్చేవారు. ప్రసుత్తం ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, ఇతరత్రా అన్నింటికీ సమస్యలు ఏర్పడుతాయి. ఉమ్మడి హక్కు పత్రాలు పొందిన రైతులు మళ్లీ తమకు వ్యక్తిగతంగా.. సర్వే సబ్‌ డివిజన్‌ చేసి విడివిడిగా హక్కు పత్రాలు ఇవ్వాలని ముందుగా మండల తహసీల్దారుకు, రీసర్వే ఉప తహసీల్దారుకు, మండల సర్వేయర్‌కు విన్నవించుకోవాలి. భూదస్త్రాలు తగిన ఆధారాలతో సదరు సర్వే నంబరును సర్వే చేయించుకోవాలి. సబ్‌ డివిజన్‌ చేయించుకున్న తర్వాత మండల తహసీల్దారు నుంచి జేసీకి భూ హక్కు పత్రాలకు విడివిడిగా ఇచ్చేందుకు నివేదిస్తారు. జేసీ విచారణ అనంతరం సదరు రైతులకు విడివిడిగా హక్కు పత్రాలు పంపిణీ చేస్తారు. రీసర్వే చేసి లేని సమస్యలు సృష్టించి.. మళ్లీ తహసీల్దారు, జేసీ సమక్షంలో విచారణ జరిపిన తర్వాత హక్కు పత్రాలను విడిగా ఇస్తారని చెబుతుండటంతో ఆ పత్రాల కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

పేదల భూములు లాక్కునే చట్టమిది

కెంగార కుమార్‌, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఏపీ భూయాజమాన్య హక్కుల చట్టం 2023 దుర్మాగమైనది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. సామాన్యులకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు. బలవంతులు పేదల భూములు లాక్కునే చట్టమిది.. గ్రామీణ ప్రాంతాల్లో వివాదాలు తీవ్రమై కక్షలు పెరుగుతాయి. అన్యాయం జరిగితే కోర్టులను కూడా ఆశ్రయించే పరిస్థితి ఉండదు.

మా పుస్తకంలో మరొకరి పేరు

హేమంత్‌కుమార్‌, లింగాలపల్లి

న్యూస్‌టుడే, వెల్దుర్తి: మా గ్రామంలో మొదటి విడత కింద భూరీసర్వే చేపట్టారు. సర్వే నంబరు-259లో 82 సెంట్ల భూమి ఉంది. ఇదే సర్వే నంబరుతో నాగ వెంకటేశ్వర్లు అనే మరో రైతుకు భూమి ఉంది. పాత పాస్‌ పుస్తకంలో నాకు సంబంధించిన పొలం విస్తీర్ణంతోపాటు నా పేరు మాత్రమే ఉండేది. రీసర్వే అనంతరం అధికారులు ఇచ్చిన పాస్‌ పుస్తకంలో 259 సర్వే నంబరు 927తో ఉమ్మడి ఎల్‌పీ నంబరు కేటాయించారు. పాస్‌ పుస్తకంలో నా పేరుతోపాటు, నాగ వెంకటేశ్వర్లు అనే రైతు పేరు నమోదైంది. ఫలితంగా పొలం క్రయ, విక్రయాలు చేయలేని పరిస్థితి నెలకొంది. నాగ వెంకటేశ్వర్లు అనే రైతు మరో ఎల్‌పీ నంబరు కేటాయించాలని అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదు.

కొత్త విధానôతో అవస్థలే

సుధాకర్‌, రైతు, బనవనూరు

న్యూస్‌టుడే, ఆస్పరి: మా అమ్మపేరు బºయ నాగలక్ష్మి, మూడు ఎల్‌పీ నంబర్లలో కలిపి 3.28 ఎకరాల భూమి ఉంది. ఎల్‌పీ 111 సర్వే నంబర్లు 52, 53-1, 52-2లో 2.78 భూమి ఉంది. ఎల్‌పీ 114 సర్వే నంబరు 54-1లో 0.21 సెంట్ల భూమి, ఎల్‌పీ 118 సర్వే నంబరు 54-2లో 0.27 సెంట్ల భూమి ఉంది. 114, 118 ఎల్‌పీలో జాయింట్‌ ఎల్‌పీ నంబర్లలో మా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. దీంతో అమ్మకానికిగాని, వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయడానికి వెళ్తే అందరి ప్రమేయం తీసుకోవాలి. మా భూమి ఇతరులకు జాయింట్‌ ఎల్‌పీ చేయడం మంచి పద్ధతి కాదు. పాత పద్ధతి ప్రకారమే ఉండాలి.

289 గ్రామాల్లో పూర్తి.. 201 గ్రామాల్లో అయోమయం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2020 డిసెంబరులో భూముల రీసర్వే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబరు నాటికి ఉమ్మడి జిల్లాలోని 914 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. 2024 ఫిబ్రవరి నాటికి ఉమ్మడి జిల్లాలో సమగ్రంగా పూర్తైంది 289 గ్రామాల్లోనే మరి. మరో 201 గ్రామాల్లో సర్వే అయోమయంగా మారింది.  అత్యాధునిక సాంకేతికతతో సర్వే చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం చిక్కులు తెచ్చి పెట్టింది. వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి పెంచింది.. వారు హడావుడిగా చేయడంతో వివాదాలకు కారణమైంది.

ఐదుగురికి ఒకే నంబరు అమ్మలేం.. కొనలేం

మౌలాలి, ఎర్రబాడు, గోనెగండ్ల

న్యూస్‌టుడే, గోనెగండ్ల : మా గ్రామంలో నాకు 20 ఎకరాల పొలం ఉంది. మేము ఐదుగురు అన్నదమ్ములం. గ్రామంలో మొదటి విడతలో భూసర్వే చేశారు. 208-9, 208-10 సర్వే నంబర్లలో నాకు 3.86 ఎకరాల పొలం ఉంది. రీసర్వే తర్వాత 0.50 సెంట్లు తక్కువ చూపారు. 240 సర్వే నంబరులో 7.95 ఎకరాల పొలం ఉంది. 0.15 సెంట్లు తక్కువ చూపి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. మొత్తం మీద 0.65 సెంట్ల పొలం కోల్పోయాను. దీనికితోడు మరో కొత్త సమస్య తలెత్తింది. అన్నదమ్ములందరికీ ఒకే ఎల్‌పీ నంబరుతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేశారు. అవసరాలను బట్టి భూమి అమ్ముకోవాలన్నా అన్నదమ్ములు కలిసి అమ్ముకోవాలి. రెండేళ్లుగా భూసమస్య పరిష్కారానికి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఎటువంటి స్పందన లేదు. మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం, కలెక్టరుకు వినతులు ఇచ్చినా ప్రయోజనం లేదు. 0.65 సెంట్ల పొలానికి రూ.10 లక్షల వరకు నష్టపోయాను. పాత పద్ధతే తిరిగి అమలు చేయాలి.

చిన్నకారు రైతులకు అవస్థలే

కుక్కల శివ, రైతు, అగ్రహారం

న్యూస్‌టుడే, మద్దికెర: మాది మద్దికెర మండలం. అగ్రహారం రెవెన్యూ పరిధిలో ఎల్‌పీ నంబరు 1184లో 4.24 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబరుకు బదులుగా ఎల్‌పీ నంబరు కేటాయించడంతో రాబోయే రోజుల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ తెలియని మాలాంటి రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే వైకాపా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని