logo

‘స్మార్ట్‌’గా జగన్‌ బురిడీ

మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.!

Updated : 07 May 2024 06:50 IST

మధ్యతరగతికి సొంతిల్లంటూ వంచన
జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌లకు స్థల సేకరణ జరగని వైనం
న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు

‘‘మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.!

2022 జనవరి 11న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి.’’

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది మధ్య తరగతి ప్రజలు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని దరఖాస్తు చేశారు. వారి కలలను కల్లలు చేశారు జగన్‌. అదిగో.. ఇదిగో అంటూ హడావుడి చేసి ఉసూరుమనిపించారు. ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో తప్ప మిగిలిన చోట్ల స్థలసేకరణే చేపట్టలేదు. ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారంలో 110.10 ఎకరాలు సేకరించారు. అక్కడ తారు, సిమెంట్‌ రోడ్డు కాదు కదా.. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. మట్టిరోడ్డు వేసిన గుత్తేదారులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 

కానరాని వసతులు

సాధారణంగా జగనన్న టౌన్‌షిప్‌లో 60 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు, 40 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, నీళ్ల ట్యాంకులు, కుళాయిలు, పార్కులు ఏర్పాటు చేయాలి. బనవాసిలో రూ.58 కోట్లు, ఆళ్లగడ్డలోని టౌన్‌షిప్‌లో రూ.8.93 కోట్లతో సదుపాయాల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఎవరూ రాలేదు. ‘ఆళ్లగడ్డ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ అభివృద్ధికి నిధులు రావాల్సి ఉంది. కుడా వారు మొదటి విడతగా రూ.8 లక్షలు విడుదల చేయాలి. ఈ డబ్బుతో భూమి చదును చేసి చెట్లు తొలగించాలి.

ఆళ్లగడ్డలో ఒక్కరూ ముందుకు రాలేదు

ఆళ్లగడ్డ స్మార్ట్‌ టౌన్‌షిప్‌నకు కేటాయించిన స్థలాన్ని అభివృద్ధి చేయలేదు. కనీసం ప్లాట్లుగా విభజించి హద్దులు కూడా ఏర్పాటు చేయలేదు. ఆళ్లగడ్డ పట్టణానికి కి.మీ. దూరంలో 14.93 ఎకరాల విస్తీర్ణంలో 154 ప్లాట్లను మూడు భాగాలుగా విభజించి టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థలాల కొనుగోలుకు ఒక్కరూ ముందుకు రాలేదు. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి ప్లాట్లుగా వేసిన అధికారులు ఇక్కడ సెంటు ధర రూ.3.36 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధర ఎక్కువగా ఉందని జనం భావించడం, ఇదే ధరకు పట్టణంలోనే ఇళ్ల స్థలాలు లభ్యమవుతుండటంతో ఆసక్తి చూపలేదు.

ఆశలు కల్పించి... దరఖాస్తులు స్వీకరించి

కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో స్థలాల కోసం 13 వేల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 150, 250, 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. లేఅవుట్లలో రహదారులకు 30 శాతం, ఖాళీ స్థలాలకు 10 శాతం, మౌలిక వసతులకు ఐదు శాతం, ఆసుపత్రులు, కమ్యూనిటీ భవనాలకు ఒక శాతం చొప్పున స్థలాలు కేటాయిస్తామని గొప్పగా ప్రకటించింది. పాఠశాలలు, ఆసుపత్రులు, నిత్యావసరాలు, బ్యాంకులు, వార్డు సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రాలు, పిల్లలకు ఆట స్థలాలు అందుబాటులో ఉంటాయని నమ్మించింది. వాటికితోడు వీధిదీపాలు, డ్రైనేజీ, విద్యుత్తు, సౌర దీపాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని, ఉద్యానాలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో చాలామందిలో ఆశలు చిగురించాయి. ఇంతవరకు స్థలాల సేకరణే జరగలేదు. ఈ పథకం ఉంటుందో లేదో తెలియడం లేదు.

బనవాసిలో బాలేదు

ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారంలో పశు సంవర్ధక శాఖకు చెందిన (సర్వే నంబర్లు 313పీ, 314, 324, 325, 326, 332 (పి), 342) 110.10 ఎకరాల భూమిని జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ కోసం కేటాయించారు. స్థలాన్ని 1,134 ప్లాట్లుగా విభజించారు. ఇందులో 60, 40 అడుగుల రహదారులు, పార్కులు, మైదానాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 37 ఎకరాలు వినియోగించుకొనేలా ప్రణాళిక రూపొందించారు. స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో మూడు సెంట్ల ప్లాట్లు 447, నాలుగు సెంట్లు 460, ఐదు సెంట్లు 199గా విభజించారు. ముందుగా 39 ఎకరాల్లో ముళ్లపొదలు, రాళ్లు తొలగించారు. మట్టి రోడ్లను వేసి వదిలేశారు. వీటికి రూ.22 లక్షల మేర ఖర్చు చేశారు. గుత్తేదారుకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. మిగిలిన 70 ఎకరాల్లో ముళ్ల పొదలు, రాళ్లు, గుంతలతో ఉంది. కాలనీలో బీటీ రోడ్లు 1,330 మీటర్లు, సీసీ రోడ్లు 10,300 మీటర్లు, డివైడర్లు 1,330 మీటర్లు, నడకదారులు 23 వేల మీటర్లు, కాల్వలు 23 వేల మీటర్లు, పైపులైన్లు 73 వేల మీటర్లు, యూజీడీ 11 కి.మీ. మేర పనులు చేపట్టాలి. వీటికి రూ.42 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు రూపొందించి టెండర్లు పిలిచారు. గుత్తేదారులు ఎవరూ రాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు.

స్థలసేకరణ ఊసేదీ?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది చోట్ల స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు సుమారు 500 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉంది. కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పురపాలక సంఘాల శివారు ప్రాంతాల్లో అధికారులు భూముల్ని పరిశీలించారు. కొన్నింటిని గుర్తించిన అధికారులు సంబంధిత రైతులతో సమావేశాలు నిర్వహించారు. భూములు తీసుకుంటే తమ జీవనం ఎలా అని కొందరు రైతులు ప్రశ్నించడంతో అడుగులు ముందుకుపడలేదు. కర్నూలు, నంద్యాల వంటి పట్టణాల్లో ఎకరం ధర కనిష్ఠంగా రూ.5 కోట్ల వరకు ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ వంటి పట్టణాల్లో ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు, మిగతా మున్సిపాల్టీలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ధరలు ఉన్నాయి. ఈ ధరలతో కొనుగోలు చేయడానికి ఏడాదిన్నరగా అధికారులు అన్ని ప్రయత్నాలు చేసి ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించారు. పట్టణాలకు 5 కి.మీల దూరంలో స్థల సేకరణకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, నంద్యాల, ఆత్మకూరు, డోన్‌, ఆదోనిలోని భూములపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో అన్నీ తిరస్కరణకు గురయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని