logo

జగన్మాయా..వైద్యం అందదయా!

ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి జగన్‌, ప్రజాప్రతినిధులు పలు ప్రసంగాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు.

Published : 10 May 2024 02:45 IST

 రోగులు లేక ఖాళీగా ఉన్న మంచాలు

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి జగన్‌, ప్రజాప్రతినిధులు పలు ప్రసంగాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. ఆదోనిలో ప్రజల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టణంలో మొత్తం ఆరు కేంద్రాలుండగా.. ఒకటి.. రెండు కేంద్రాలు తప్ప.. మిగిలిన వాటిలో అరకొర రోగులతోనే సరి పెడుతున్నారు. గతంలో నాలుగు కేంద్రాలుండేవి.. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆస్పత్రులుండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆదోనికి అదనంగా రెండు వైద్య కేంద్రాలు మంజూరు చేసింది. ఒక్కో దానికి రూ.80 లక్షలు దాకా నిధులను విడుదల చేసింది. స్థల భావ సమస్య కారణంగా.. ఏడాదిన్నర పాటు అద్దె భవనాల్లో కొనసాగించారు. తర్వాత చివరికి సంబంధం లేని వార్డుల్లో ఆస్పత్రిని నిర్మించి.. రోగులను ఇక్కట్ల పాలు చేశారు.

 రెండంక్కెలు మించని ఓపీ

 ఒకప్పుడు అర్బన్‌ కేంద్రాల్లో నిత్యం 100-150 దాకా ఓపీ ఉండేది. ప్రస్తుతం ఒక్కటి.. రెండు కేంద్రాల్లోనే ఆశించిన స్థాయిలో ఓపీ ఉంటోంది. మిగిలిన వాటిలో రోజువారి ఓపీ రెండక్కెలకు మించడం లేదు. ఇలాంటి కేంద్రాల్లో ఇతరుల ఆధార్‌ పత్రాలు నమోదు చేసి వైద్యసేవలు పొందినట్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తమవుతున్నాయి. ఇక వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తారో.. ఎవరు ఉంటారో అంతుచిక్కడం లేదు. రూ.లక్షలు విలువ చేసే మంచాలు, పరికరాలు అందించినా.. వాటిని వినియోగించకపోవడం గమనార్హం.

రోగులకు అదనపు భారం

హవన్నపేటకు సంబంధించిన అర్బన్‌ ఆరోగ్య కేంద్రం.. పాత ఆకాశవంతెన కింది మార్గంలో ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి ఆరేడు వార్డులు వస్తాయి. ఇక్కడి గర్భిణులు నెలసరి పరీక్షలు, టీకాల కోసం 2 కి.మీ.ల దూరంలో ఉన్న పాత ఆకాశవంతెన కింది మార్గంలో ఉన్న కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. అయితే వీరు అక్కడికి చేరుకోవాలంటే ఆటోలో రూ.200లు వెచ్చించాల్సిందే. ఇది అదనపు భారమని రోగులు వాపోతున్నారు. బంగారు బజారుకు సంబంధించి అర్బన్‌ ఆరోగ్య కేంద్రం శివారులోని రాయచూర్‌ రహదారిలోని రాయనగర్‌ పైకొట్టాల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ వార్డు వాసులు అక్కడికి వెళ్లలేక ప్రైవేటు వైద్య సేవలు పొందుతున్నారు.

* గత తెదేపా ప్రభుత్వంలో 36 రకాల రక్త, మూత్ర తదితర పరీక్షలు నిర్వహించేవారు. అతి ఖరీదైన థైరాయిడ్‌ వంటి పరీక్షలుండేవి. వైకాపా అధికారంలోకి రాగానే వీటన్నింటిని తొలగించింది. బీపీ, షుగర్‌, మూత్ర పరీక్షలు తప్ప ఖరీదైన పరీక్షలను పక్కన పెట్టింది.
వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవల కోసం వచ్చే రోగులకు కనీస వసతులు కరవయ్యాయి. వెల్దుర్తిలో నిత్యం 180-200 వరకు ఓపీ ఉంటుంది. ఆస్పత్రిలో రోగుల సహాయకులు కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో రోగి మంచంపైనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. సీహెచ్‌సీలో గుండె వ్యాధి నిపుణుడు లేరు. ఆస్పత్రిలో ఎక్స్‌రే యంత్రం ఉన్నా... సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది.
- న్యూస్‌టుడే, వెల్దుర్తి

పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో దశాబ్ధాలు గడిచినా సమస్యలు తొలగడం లేదు. ఈ ఆస్పత్రికి పత్తికొండ నుంచే కాక మండలంలోని వివిధ గ్రామాల నుంచి నిత్యం 250-300 వరకు రోగులు వస్తుంటారు. ప్రధానంగా ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంది. గడిచిన ఐదేళ్ల జగన్‌ పాలనలో ఆస్పత్రిలో అనేక సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రూ.55లక్షల వ్యయంతో గత ఆరు నెలల కిందట రోగులు చికిత్స పొందే ప్రాంగణ మరమ్మతు పనులు చేపట్టారు. బిల్లుల జాప్యం కారణంగా గుత్తేదారు పనులు నిలిపివేశారు.  

- న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు