logo

కమనీయం.. ఉమామహేశ్వరుడి కల్యాణం

శ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలుగొందుతున్న ఉమామహేశ్వరం క్షేత్రంలో ఆదివారం తెల్లవారు జామున ఉమామహేశ్వరుల కల్యాణోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గువ్వల

Published : 17 Jan 2022 01:48 IST

పట్టు వస్త్రాలు సమర్పించిన విప్‌ గువ్వల బాల్‌రాజు

భక్తులకు మంగళ సూత్రాలు చూపుతున్న వేద పండితులు, చిత్రంలో విప్‌ గువ్వల బాల్‌రాజు

అచ్చంపేట, న్యూస్‌టుడే : శ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలుగొందుతున్న ఉమామహేశ్వరం క్షేత్రంలో ఆదివారం తెల్లవారు జామున ఉమామహేశ్వరుల కల్యాణోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తిశ్రద్ధలతో తరలించిన ప్రభలు తెల్లవారు జూమున ఉమామహేశ్వరం చేరుకోగానే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అచ్చంపేట భ్రమరాంబ దేవాలయం నుంచి పార్వతీ దేవిని ఊరేగింపుగా ఉమామహేశ్వరం తరలించారు. కొండపై నుంచి ఉమామహేశ్వర స్వామిని పల్లకీ సేవ ద్వారా కొండ దిగువన భోగమహేశ్వరంలో ఉన్న కల్యాణ మండపానికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తీసుకొచ్చారు. ఉమాసదులను కల్యాణోత్సవానికి ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. అచ్చంపేట భ్రమరాంబ దేవాలయ కమిటీ ప్రతినిధులు వధువు తరపున, ఉమామహేశ్వరం దేవాలయ కమిటీ నేతలు వరుడి తరఫున పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. భక్తుల సమక్షంలో వేద పండితులు ఉమామహేశ్వరుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అచ్చంపేట వీరశైవ లింగాయత్‌ సంఘం ఆధ్వర్యంలో ఉమామహేశ్వరంలో అగ్ని గుండాన్ని ఏర్పాటు చేసి భక్తులు నిప్పులపై నుంచి నడచిన ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ ఛైర్మన్‌ కందూరి సుధాకర్‌, ఈవో శ్రీనివాసరావు, ఎంపీపీ శాంతాబాయి, అచ్చంపేట భ్రమరాంబ దేవాలయ కమిటీ అధ్యక్షుడు నల్లపు శ్రీనివాసులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని