logo

పట్టాలెక్కని పర్యాటకం

పాలమూరులో పర్యాటకం పట్టాలు ఎక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో 34 ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ గుర్తించింది. నల్లమల్ల, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక, వారసత్వ సంపద, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా ఉన్న పాలమూరును పర్యాటక సమూహంగా

Published : 27 Sep 2022 01:07 IST

వసతులు లేక ముందుకెళ్లని ప్రణాళికలు

 నేడు ప్రపంచ టూరిజం దినోత్సవం

- ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

నల్లమల్లలో పర్యాటకుల మనసు దోచే ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌

పాలమూరులో పర్యాటకం పట్టాలు ఎక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో 34 ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ గుర్తించింది. నల్లమల్ల, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక, వారసత్వ సంపద, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా ఉన్న పాలమూరును పర్యాటక సమూహంగా ఏర్పాటుచేయాలని 2019లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో  ఎకో, రివర్‌, టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేస్తామని, ఇందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తామని ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవటంతో నిరాశే మిగిలింది. మహబూబ్‌నగర్‌లో మాత్రం కొన్ని అడుగులు పడ్డాయి. రూ. 8 కోట్లతో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంకుబండ్‌ అభివృద్ధిలో భాగంగా మినీ ఐల్యాండ్‌, తీగల వంతెన ఏర్పాటు చేస్తున్నారు.

నల్లమలలో నత్తనడక..
నల్లమల్ల ప్రాంతంలో ఎకో, రివర్‌ టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. సోమశిల నుంచి ఈగలపెంట వరకు(శ్రీశైలానికి) కృష్ణానదిలో లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. మధ్యలో అక్క మహాదేవి గుహలు, అక్టోపస్‌ వంటి ప్రాంతాలను చూసేలా, తర్వాత శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనం, వసతికి ప్రణాళిక ఏర్పాటు చేశారు. సోమశిల వద్ద రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునాత లాంచీని గతేడాది ఐదారు ట్రిప్పులకే పరిమితమైంది. ఎకో టూరిజం అభివృద్ధికి నల్లమల్లలో రూ. 91.62 కోట్లతో పనులు పూర్తయినా ప్రచారం లేక పర్యటకులు అనుకున్న స్థాయిలో రావడం లేదు. మహబూబ్‌నగర్‌ సమీపంలోని మయూరి పార్కు ఎకో టూరిజంకు అనుకూలంగా ఉంటుందని గతేడాది గుర్తించారు. ఆ దిశగా పర్యాటలకు కావాల్సిన ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం ఇంకా చేయలేదు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి సంరక్షణకు చర్యలు చేపట్టినా అక్కడ సౌకర్యాలు లేవు. కోయిల్‌కొండ కోట, జడ్చర్ల మండలంలోని గొల్లత్తగుడి నిర్లక్ష్యం నీడలోనే మగ్గుతున్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.


ఆలయాల అనుసంధానమేదీ?

ఉమ్మడి జిల్లాలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అలంపూర్‌, జమ్మిచేడు, మల్దకల్‌, బీచుపల్లి, శ్రీరంగాపూర్‌, సోమశిల, ఉమామహేశ్వరం, సలేశ్వరం, సింగోటం, గంగాపురం, మన్యంకొండ, శ్రీకురుమూర్తి ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్‌ టూరిజం సమూహాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు రూపుదిద్దుకోలేదు.
అనుకున్నట్లు అమలైతే : ఎకో, రివర్‌, టెంపుల్‌ టూరిజం సమూహాల ఏర్పాటు అనుకున్నట్లు జరిగితే పాలమూరు పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మౌలిక వసతులు కల్పించి ప్రణాళికలు అభివృద్ధి చేస్తే రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు పాలమూరు బాటపడతారు. అయిదు జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలను రెండు రోజుల్లో సందర్శించేలా బస్సు, వసతి, భోజనం సదుపాయాలను పర్యటక శాఖనే కల్పించి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాల్సి ఉంది. వీరికి గైడ్‌ను కూడా నియమించాలి. ఉపాధి అవకాశాలు, వ్యాపారం వృద్ధి చెందుతాయి.


అభివృద్ధి చేస్తున్నాం..
పాలమూరులో ఎకో, రివర్‌, టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేస్తున్నాం. సోమశిల నుంచి శ్రీశైలంకు ఏర్పాటు చేసిన లాంచీని పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకొస్తాం. దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాం. దేవాలయాల్లో వసతుల కల్పనకూ చర్యలు చేపడతాం.
- మనోహర్‌, ఎండీ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని