logo

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

శ్రీశైలమహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని,  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా, దేవస్థానం అధికారులను నంద్యాల కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు.

Updated : 01 Feb 2023 06:28 IST

సమావేశంలో నంద్యాల కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎస్పీ రఘువీర్‌రెడ్డి,

ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైలమహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని,  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా, దేవస్థానం అధికారులను నంద్యాల కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. మంగళవారం సీసీ కంట్రోల్‌రూంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌తోపాటు ఎస్పీ రఘువీర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, నంద్యాల, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు అధికారులు, దేవస్థానం అధికారులతో సమావేశమయ్యారు. ఏర్పాట్లపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశైల క్షేత్రాన్ని 10 జోన్లుగా, 40 సెక్టార్లుగా విభజించి జిల్లాస్థాయి అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో దాదాపు 3 వేల వాహనాలు నిలపడానికి అవకాశం ఉందన్నారు.ఈవో మాట్లాడుతూ.. భక్తులకు సులభంగా స్వామివారి దర్శనమయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. 30 లక్షల లడ్డూ  ప్రసాదాలను భక్తులకు అందిస్తామన్నారు. 

శాఖలవారీగా ఆదేశాలు..: ఆంధ్రప్రదేశ్‌ నుంచి 650, తెలంగాణ రాష్ట్రం నుంచి 180 బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్‌ఎంను కలెక్టర్‌ ఆదేశించారు.

దేవస్థానం గదులు, ప్రైవేటు సత్రాల్లో 35 శాతం గదులను స్వాధీనం చేసుకోవాలని ఆత్మకూరు డీఆర్వోను ఆదేశించారు.

పారిశుద్ధ్య లోపం లేకుండా అవసరమైన సిబ్బందిని కేటాయించుకొని దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని డీపీవోనుఆదేశించారు.

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రదేశాలను గుర్తించి ట్యాంకర్లు, కుళాయిలు ఏర్పాటుచేయాలన్నారు.

కల్తీ ఆహారపదార్థాలు నియంత్రించేందుకు లేబర్‌ కమిషనర్‌, లీగల్‌ మెట్రాలజీ, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను బృందాలుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

రద్దీ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్యనిపుణులు, మందులను సిద్ధం చేసుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. శ్రీశైలంలోని పీహెచ్‌సీ, దేవస్థానం ఆసుపత్రి, సున్నిపెంటలోని వైద్యశాల, శ్రీశైలంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల ఆసుపత్రి 24 గంటలు నిర్వహించేలా వైద్య సిబ్బందిని కేటాయించాలన్నారు. ఏడు అంబులెన్స్‌లు, పాదయాత్ర మార్గంలో ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతిస్తున్నామని, 240 మంది గజఈతగాళ్లు, అవసరమైన లైఫ్‌ జాకెట్లు, పుట్టీలు, తాత్కాలిక మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీని ఆదేశించారు.

11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో దాదాపు 8 లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మొబైల్‌ నెట్‌వర్క్‌ సరిపోయే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో, ఐడియా సంస్థలతో మైక్రోటవర్లను ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని