logo

ఆస్పత్రిలో వాహనాల రద్దీ

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చే వాహనాలు రోడ్డుపైనే ఇష్టానుసారం నిలిపేస్తున్నారు.

Published : 02 Feb 2023 04:41 IST

రాకపోకలకు తీవ్ర అంతరాయం  
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం

కొవిడ్‌ చికిత్స భవనం వద్ద అడ్డంగా నిలిపిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చే వాహనాలు రోడ్డుపైనే ఇష్టానుసారం నిలిపేస్తున్నారు. దీంతో అత్యవసర సేవల కోసం వాహనాల ద్వారా వచ్చే రోగులు ఆస్పత్రిలోకి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విశాలమైన ప్రాంగణం ఉన్నా అక్కడ వరస క్రమంలో నిలుపుకోకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలుపుతుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఆసుపత్రికి నిత్యం 2 వేలకు పైగా వాహనాల్లో వివిధ రకాల వైద్య సేవల కోసం రోగులు వస్తున్నారు. ఎలాంటి వాహనాలు లేని వారు ఆటోల్లో వస్తుండటంతో వాటి సంఖ్య కూడా ఎక్కువ అయ్యాయి. రోగులను తీసుకొచ్చిన ఆటోలు వెళ్లే˜్లటప్పుడు కూడా కిరాయి కోసం వేచి చూస్తుండటంతో ఆస్పత్రి పరిసరాల్లో రద్దీ  పెరుగుతుంది. ద్విచక్ర వాహనాలు ఎక్కడ పడితే అక్కడే ఆపేసి ఆస్పత్రి లోపలికి వెళ్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

అక్కడ రద్దీ ఎక్కువ .. : ఆస్పత్రిలో మాతా శిశు భవనం వద్ద ఆటోల రద్దీ ఎక్కువగా ఉంటోంది. గర్భిణులు, బాలింతలు వారి సహాయకుల రాకపోకలతో ఇక్కడ నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. రోగులను ఇక్కడ దించిన తర్వాత రహదారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్‌ చేయడం లేదు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి అత్యవసర సేవల కోసం వచ్చే అంబులెన్స్‌లకు ఒక్కోసారి దారి ఉండటం లేదు. రోజు సుమారు 150-200 ఆటోలు, 2 వేల వరకు ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన బస్సులు, వైద్యులు, ఉద్యోగులకు చెందిన కార్లు, ఆయా ఠాణాలో నమోదైన కేసుల కోసం వచ్చే పోలీసుల వాహనాలు, అంబులెన్స్‌లు, మందులను సరఫరా చేసే లారీలు, డీసీఎంలు, ఇతర వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.  పార్కింగ్‌ స్థలాలను ఎంపిక చేసి అక్కడే వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్‌ సమస్య నివారించవచ్చు.

* వాహనాలను సక్రమంగా నిలపడానికి చర్యలు తీసుకోవాలని గుత్తేదారుకి సూచించాం. నేను కూడా  పరిస్థితిని పరిశీలిస్తాను. దవాఖానా ప్రాంగణంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా నివారించడానికి కృషి చేస్తాను.

-డా.రాంకిషన్‌, సూపరింటెండెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని