logo

సమన్వయం.. గ్రామీణ విద్యార్థులకు వరం

డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి కళాశాల విద్యాశాఖ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలల మధ్య సమన్వయం చేసుకోవడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది.

Published : 04 Feb 2023 05:44 IST

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం

ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాఠం వింటున్న విద్యార్థులు

డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి కళాశాల విద్యాశాఖ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలల మధ్య సమన్వయం చేసుకోవడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో అనుకున్న స్థాయిలో అడుగులు  పడటం లేదు. పీయూ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని 20 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఐదు క్లస్టర్లుగా  గుర్తించింది. అధ్యాపకుల సేవలు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, వసతులను సద్వినియోగం చేయడం, ఇతర కళాశాలలు వాటిని  వినియోగించుకోవడానికి వీలుగా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన బోధన అంశాల్లో కళాశాలల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. ఆధునిక సాంకేతిక వనరులు లేని కళాశాలలు  క్లస్టర్‌ సేవలను వినియోగిస్తూ తమ విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది.

విద్యార్థులకు ప్రయోజనం.. : డిగ్రీతో పాటే ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ విధానం ఉపయుక్తం. పరిశోధనల ఆవిష్కరణలు, అధ్యాపకులు, విద్యార్థుల కోసం క్లస్టర్‌ కళాశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశోధన కేంద్రాలు నెలకొల్పి ప్రాంగణ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలన్నింటినీ ఒక యూనిట్‌గా భావించి అమలు చేస్తారు. పట్టణ విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్ని వనరులు సమకూరుతాయి.   ప్రథమ నుంచి తృతీయ సంవత్సరం వరకు ప్రణాళికతో బోధన, ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ, రెగ్యులర్‌ కోర్సులతో పాటు ఉపయుక్తమైన సర్టిఫికెట్‌ కోర్సులూ నిర్వహిస్తారు. చదువులు పూర్తయిన తర్వాత విద్యార్థులకున్న నైపుణ్యాలతో కొలువు సాధనే లక్ష్యంగా సన్నద్ధం చేస్తారు. టాస్క్‌ తెలంగాణ సాఫ్ట్‌ స్కిల్‌ కేంద్రాల ద్వారా శిక్షణ అందించి ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించడంలో తోడ్పాటునందిస్తారు.

వర్చువల్‌ పద్ధతిలో తరగతులు.. : కళాశాలల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర వనరులున్న కళాశాలల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ అవిలేని విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల సమానమైన విద్య అందడంతో పాటు విద్యార్థులందరికీ మేలు చేకూరనుంది. క్లస్టర్‌ పరిధిలో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడం వల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ప్రత్యేకంగా సైన్స్‌, మ్యాథ్స్‌, కామర్స్‌, పొలిటికల్‌, ఇతర కోర్సుల్లో నిపుణులైన అధ్యాపకులతో వర్చువల్‌ పద్ధతిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులతో పాటు వివిధ రకాలైన సబ్జెక్టులపై విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. అకాడమిక్‌ అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్‌ మెటీరియల్‌లు, ఎల్‌ఎంఎస్‌ (లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌)లలోనూ ఇచ్చి పుచ్చుకోవచ్చు. అధ్యాపకుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు.

క్లస్టర్‌ వారీగా కళాశాలలు : మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల క్లస్టర్‌ పరిధిలో ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల, సైన్స్‌ కళాశాల నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కొడంగల్‌ డిగ్రీ కళాశాలలు ఉండగా, మహబూబ్‌నగర్‌ ఎన్‌టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల క్లస్టర్‌లో కొండనాగుల (నాగర్‌కర్నూల్‌), కల్వకుర్తి, నారాయణపేట కళాశాలలు ఉన్నాయి. జడ్చర్ల బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల క్లస్టర్‌లో పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నాగర్‌కర్నూల్‌), షాద్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వనపర్తి క్లస్టర్‌ పరిధిలో మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి, ఆత్మకూర్‌, పెబ్బేరు, అమ్రాబాద్‌ కళాశాలలు ఉన్నాయి. గద్వాల ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్‌లో శాంతినగర్‌, గద్వాల మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

సద్వినియోగం చేసుకుంటే మేలు : క్లస్టర్‌ విధానంతో విద్యా నైపుణ్యాలు పెంపొందుతాయి. పరిశోధన, విస్తరణ, శాస్త్ర సాంకేతిక అంశాలపై సదస్సులు నిర్వహించడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. కళాశాలలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుంది.

డా.పద్మావతి, ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని