logo

స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు చెక్‌

స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు చెక్‌ పడనుంది. బహిరంగ మార్కెట్‌లో స్టాంపు వెండర్లు ఇక నుంచి మాన్యువల్‌గా అమ్మడానికి వీలు లేదు.

Published : 01 Jun 2023 04:00 IST

అంతర్జాలంలో వివరాలను నమోదు చేసుకున్న స్టాంపు వెండర్లు

పాలమూరు, న్యూస్‌టుడే: స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు చెక్‌ పడనుంది. బహిరంగ మార్కెట్‌లో స్టాంపు వెండర్లు ఇక నుంచి మాన్యువల్‌గా అమ్మడానికి వీలు లేదు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 15 రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి అంతర్జాలంలో వివరాలను నమోదు చేసిన తర్వాతే వాటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో పలు రకాల అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాత విధానానికి స్వస్థి పలికి నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి 301 మంది స్టాంపు వెండర్లకు అనుమతి ఇచ్చింది. అంతర్జాలం ద్వారా స్టాంపులను, బాండ్లను విక్రయించడానికి ముందస్తుగా జిల్లా రిజిస్ట్రార్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకోసం వాళ్లు అన్ని వివరాలతో అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు 200 మంది స్టాంపు వెండర్లు మాత్రమే దరఖాస్తులు పంపించారు. వీరిలో 130 మందికి అనుమతించగా, మరో 70 మంది వివరాల నమోదులో తప్పుగా ఉండటంతో వారి దరఖాస్తులను తిరస్కరించారు.
పాత తేదీలు వేసి మోసాలు..: స్టాంపులను మాన్యువల్‌గా విక్రయించే సమయంలో పలువురు పాత తేదీలు వేసి అక్రమాలకు పాల్పడేవారు. ఈ రోజు కొన్న స్టాంపు పేపర్‌పై పాత తేదీ వేసుకొని సెటిల్‌మెంట్ల కోసం అగ్రిమెంట్లు రాసుకున్నట్లుగా చేసుకునేవారు. వ్యవసాయ భూములు, స్థిరాస్తి వ్యాపార కార్యకలాపాలలో తలదూర్చి తామే ముందుగా ఒప్పందాలు చేసుకున్నట్లు చేసేవారు. వీలునామాలు, ఇతర వ్యవహారాలు కూడా నడిచేవి. ఈ మోసాలను నియంత్రించడానికే ప్రభుత్వం ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 80 మంది, నాగర్‌కర్నూల్‌-85, వనపర్తి-56, జోగులాంబ గద్వాల-62, నారాయణపేట-18 మంది చొప్పున స్టాంపు వెండర్లు ఉన్నారు. వీరందరికీ పంపిణీ చేసే స్టాంపులు, బాండ్లపై ఉన్న నంబర్ల వివరాలను అంతర్జాలంలో నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే వినియోగదారులకు విక్రయించాలి. వినియోగదారులకు విక్రయించేటప్పుడు అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

మహబూబ్‌నగర్‌ కార్యాలయంలో అంతర్జాలం ద్వారా స్టాంపు బాండ్లను విక్రయిస్తున్న సిబ్బంది

* ఈ నూతన విధానం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రతి స్టాంపు వెండర్‌ తప్పనిసరిగా కంప్యూటర్‌తోపాటు, అంతర్జాల సదుపాయం కలిగి ఉండాలి. అంతర్జాలంలో వివరాలను నమోదు చేయకుండా వినియోగదారులకు స్టాంపులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

రవీందర్‌, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని