logo

అభివృద్ధిలో జిల్లాను అగ్రపథాన నిలుపుదాం

వనపర్తి జిల్లాను అభివృద్ధి పరంగా అగ్రపథాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేసి సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 03 Jun 2023 04:25 IST

జిల్లా ప్రగతిని వివరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, న్యూస్‌టుడే : వనపర్తి జిల్లాను అభివృద్ధి పరంగా అగ్రపథాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేసి సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ  దశాబ్ది ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం వద్ద మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఎస్పీ కె.రక్షిత మూర్తి, జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, ఏఎస్పీ షాకీర్‌ హుసేన్‌, పుర అధ్యక్ష, ఉపాధ్యక్షులు గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌ తదితరులు జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రగతిపై ఆయన చెప్పిన వివరాలు ఇలా..

పెరిగిన వ్యవసాయం : జిల్లాలో 2022-23లో సాగునీటి వనరులు, పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం మొదట్లో వానాకాలంలో వివిధ రకాల పంటలు 1,95,872 ఎకరాల్లో సాగు చేస్తుండగా.. ఇప్పుడు 2,61,284 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. సాగునీరు 1,72,005 ఎకరాలకు ఒకపంటకు మాత్రమే అందేది. ఇప్పుడు వానాకాలం, యాసంగి పంటలకు కలిపి 4,44,811 ఎకరాలకు నీరందిస్తున్నాం. సాగునీటి వనరుల్లో 158.60 శాతం వృద్ధి జరిగింది. జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద 911 చెరువుల పునరుద్ధరణ, కాల్వల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.136.28 కోట్లు ఖర్చు చేశాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా రూ.700 కోట్లతో ఏదుల జలాశయం నిర్మించాం. రూ.205 కోట్లతో నిర్వాసితులకు పునరావాస గ్రామాలను నిర్మించాం. కేఎల్‌ఐ కింద 1,17,835 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు 2014 నుంచి ఇప్పటి వరకు రూ.148.21 కోట్లు ఖర్చు చేశాం. జూరాల ఎడమ కాల్వ మరమ్మతులు, నిర్వహణ కు రూ.27.83 కోట్లు ఖర్చు చేశాం.

నాణ్యమైన విద్యుత్తు సరఫరా..: జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. అందుకోసం 33/11 కేవీ ఉపకేంద్రాలు 12 నిర్మించాం, 11 నిర్మాణంలో ఉన్నాయి. మరో 13 ఉప కేంద్రాలు ఆదిత్య పథకంలో మంజూరు అయ్యాయి. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు కలిపి రూ.కోటితో  గోదాము నిర్మించాం. మత్స్యశాఖలో నీలి విప్లవం తీసుకొచ్చాం. జిల్లాలో 38 మంది మత్స్యకారులకు చెరువుల నిర్మాణం కోసం రూ.1.85 కోట్ల రాయితీ ఇచ్చాం. రాష్ట్రంలో తొలి మత్స్య కళాశాలను పెబ్బేరులో ప్రారంభించాం.

వనపర్తిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధంగా రూ.38.40 కోట్లతో నర్సింగ్‌ కళాశాలను  నిర్మించామన్నారు. స్వరాష్ట్రం వచ్చాక శ్రీరంగాపూరు, వెల్టూరు, అమరచింతలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏదుల, కర్నెతండా, చిన్నంబావి, కేతెపల్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వైకల్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. వయోవృద్ధుల సంరక్షణకు హెల్త్‌కేర్‌ కేంద్రాన్ని ప్రారంభించాం.

మిషన్‌ భగీరథ అద్భుతం..: ఇంటింటికి శుద్ధజలం అందించడానికి మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం. జిల్లాకు రూ.260.50 కోట్లు మంజూరు కాగా.. రూ.206 కోట్ల వ్యయంతో 984.9 కి.మీ. పైపులైన్లు వేశాం. ఆరు ఉపరితల, రెండు భూగర్భ జల భాండాగారాలు, 16 సంపుల నిర్మాణం పూర్తి చేశాం. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన రూ.310.99 కోట్లకు గాను రూ.238.61 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం.

* పురపాలక, పౌర సరఫరాలు, ఉద్యానం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట© సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలు, జిల్లా పరిషత్తులో సాధించిన ప్రగతిని మంత్రి నివేదికలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు వేణాచారి కుటుంబ సభ్యురాలిని సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని