logo

పారిశ్రామిక రంగం కొత్త పుంతలు..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరులో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కింది. ఇటీవల మహబూబ్‌నగర్‌ శివారులోని దివిటిపల్లిలో 262 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా బ్యాటరీస్‌ గిగా కారిడార్‌కు శంకుస్థాపన, భూమిపూజ చేశారు.

Updated : 03 Jun 2023 04:31 IST

విద్య, వైద్య రంగాల్లో పురోగతి

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరులో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కింది. ఇటీవల మహబూబ్‌నగర్‌ శివారులోని దివిటిపల్లిలో 262 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా బ్యాటరీస్‌ గిగా కారిడార్‌కు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే 10వేల మందికి ఉపాధి లభించనుంది. మరో ఐదెకరాల్లో రూ.40కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ భవనాన్ని ప్రారంభించారు. దీని ద్వారా నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల ఉద్యోగాలే లక్ష్యంగా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు ముందుకొచ్చాయి. 2014లో రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కోసం టీఎస్‌ఐపాస్‌ ఏర్పాటు చేసింది. పాలమూరు జిల్లాల్లో మహబూబ్‌నగర్‌ శివారులోని ఐటీ, మల్టీపర్పస్‌ ఇండ్రస్ట్రీస్‌ కారిడార్‌, జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ, జడ్చర్ల, గద్వాల, పాలెం పారిశ్రామికవాడలున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎల్‌ఐజీ హౌజ్‌, నంచర్లలో పారిశ్రామికవాడల అభివృద్ధికి టీఎస్‌ఐఐసీ స్థలాలను కేటాయించింది.  2015 నుంచి ఉమ్మడి జిల్లాకు 665 యూనిట్లు వచ్చాయి. ఈ పరిశ్రమల్లో రూ.12,540 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

మెరుగవుతున్న సేవలు..

2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే మొదటి వైద్య కళాశాలను మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాలను పీజీకి అప్‌గ్రేడ్‌ చేశారు. జిల్లా ఆస్పత్రిని జనరల్‌ ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం 650 పడకలతో వివిధ సేవలందిస్తున్నారు. మరోవైపు పాత కలెక్టరేట్‌ స్థానంలో రూ.500 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో ఉంది. జిల్లాలుగా మారడంతో నాగర్‌కర్నూల్‌, గద్వాల, నారాయణపేట, వనపర్తి ప్రాంతీయ ఆస్పత్రులను జిల్లాస్థాయి ఆస్పత్రులుగా మార్చారు. కొత్తగా నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు వైద్య కళాశాలలు వచ్చాయి. జిల్లా ఆస్పత్రులను 100 పడకల నుంచి 380 పడకలకు మార్చారు. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు కూడా మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఐదు వైద్య కళాశాలలకు ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయించింది. ఐదు జిల్లాలకు నర్సింగ్‌ కళాశాలలను మంజూరు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, అచ్చంపేటలో ఇటీవలే వంద పడకల ఆస్పత్రులు ప్రారంభించారు. జిల్లాలోని బాలానగర్‌, కోయిల్‌సాగర్‌లో 30 పడకలతో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆమ్రాబాద్‌, ఉప్పునుంతల మండలాల్లో 30 పడకల ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. నారాయణపేట జిల్లాలో చిన్న పిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు కొల్లాపూర్‌లో మతాశిశు సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.

ఉన్నత విద్య వైపు  అడుగులు..

పాలమూరు జిల్లాల్లో విద్యారంగంలో పలు మార్పులొచ్చాయి. ప్రధానంగా ఉన్నత విద్యకు ప్రాధాన్యం లభిస్తోంది. ఒకప్పుడు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్‌ కళాశాలలకే పరిమితమైన ఈ జిల్లాల్లో ఉన్నత విద్య సంస్థలకు అడుగులు పడ్డాయి. వనపర్తి జిల్లాకు జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాల వచ్చింది. రాష్ట్రంలో నాలుగో కళాశాల ఈ ప్రాంతానికి రావడం గమనార్హం. పాలమూరు యూనివర్సిటీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. పీయూ పరిధిలో కొత్తగా ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ(తెలుగు) కోర్సులు ప్రారంభించారు. వనపర్తిలో మైక్రోబయోలజీ, కొల్లాపూర్‌లో స్టాటిస్టిక్స్‌, గద్వాలలో ఎంబీఏ కోర్సులను ప్రవేశపెట్టారు. నారాయణపేట జిల్లాలోని ధన్వాడ, మక్తల్‌కు డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు ఉద్యానవన పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరైంది. రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి జిల్లాలో 35 గురుకులాలుంటే వాటి సంఖ్య ప్రస్తుతం 105కు పెరిగింది. గతంలో మైనార్టీ గురుకులాల్లేవు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లాలో 30 వరకు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయడం విశేషం. ‘మన ఊరు-మన బడి’లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 291 పాఠశాలలు, నాగర్‌కర్నూల్‌-290, వనపర్తి-183, జోగులాంబ గద్వాల-161, నారాయణపేటలో 174 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,188 పాఠశాలలున్నాయి. అందులో 3.51 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2లక్షల మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు.

సాంకేతిక విద్యపైనా దృష్టి సారించాలి

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్దఎత్తున గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన, వసతి సౌకర్యాలు సమకూరాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తే  నడిగడ్డకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం సాంకేతిక, వృత్తి విద్యాసంస్థలను పెద్దఎత్తున నెలకొల్పాల్సిన అవసరం ఉంది.  

హంపయ్య, గద్వాల

వైద్యరంగంలో మెరుగైన అభివృద్ధి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య కళాశాలను ప్రారంభించారు. డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి రావడం శుభపరిమాణం. జనరల్‌ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను భర్తీ చేస్తే రోగులకు మరిన్ని సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అత్యవసర వాహనాల సంఖ్య మరింత పెంచాలి. సర్కారు దవాఖానాల్లో వైద్యుల జవాబుదారీతనం పెంచాలి.  

పద్మావతి, నాగర్‌కర్నూల్‌

పెట్టుబడులు ఆకర్షించాలి..

యువతరానికి ఉద్యోగ కల్పన, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, అందుబాటులో ఉన్న వనరులను ఆదర్శవంతంగా వినియోగించుకోవడం ద్వారా వృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలి. పట్టణ, గ్రామీణ యువతరానికి ఉపాధి అవకాశాలు సృష్టించేలా ఉత్పాదక రంగాలపై దృష్టి కేంద్రీకరించాలి. నిరంతర విద్యుత్తు లభ్యత, పారిశ్రామికాభివృద్ధిలో అత్యంత ప్రధానం. పాలమూరు హైదరాబాదుకు సమీపంలో ఉండటం అన్ని విధాలుగా పారిశ్రామికాభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుంది.

డా.ఎం.అనురాధరెడ్డి, కామర్స్‌ విభాగాధిపతి, పీయూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని