logo

మాయమాటలతో మైనార్టీలు మోసపోవద్దు : డీకే అరుణ

లోక్‌సభ ఎన్నికల వేళ మాయమాటలు నమ్మి మైనార్టీలు మోసపోవద్దని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

Published : 27 Mar 2024 02:25 IST

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల వేళ మాయమాటలు నమ్మి మైనార్టీలు మోసపోవద్దని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణం హనుమాన్‌పుర, హబీబ్‌నగర్‌ ప్రాంతాల మైనార్టీ మహిళలతో కలిసి ఓ ఫంక్షన్‌ హాలులో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.  దేశంలో కాంగ్రెస్‌, తెలంగాణలో భారాస రాజకీయ లబ్ధికి మైనార్టీలను ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయే తప్పా జీవన ప్రమాణాలు మెరుగుపరచలేదన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న భాజపాను మతపార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్‌ ఏనాడు ముస్లిం మహిళల సమస్యలపై దృష్టి సారించలేదని, మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వమే తలాక్‌ను రద్దు చేసి సామాజిక భద్రత కల్పించిందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో అనేక ముస్లిం కుటుంబాలు కూడు, గూడు, గుడ్డ లేక దీనస్థితిలో ఉన్నాయని తెలిపారు. వారికి కేంద్రం కులమతాలకు అతీతంగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని, ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట ఆరోగ్య సేవలు అందిస్తోందని, ఇళ్లు నిర్మిస్తోందని, గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తోందని, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తోందని వివరించారు. భాజపాకు ముస్లిం మైనార్టీలు, ముఖ్యంగా మహిళలు అండగా నిలవాలని కోరారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూసుఫ్‌, జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫారూఖ్‌, ఉపాధ్యక్షుడు సిరాజ్‌ మాట్లాడుతూ పార్టీలు విడదీసి పాలించు విధానంలో మైనార్టీలను స్వార్థానికి వాడుకున్నాయని, దేశంలో ముస్లింలు భాగమనే భావనతో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. భాజపా ఒక్కటే ప్రజలంతా ఒక్కటేన్న భావనతో ముందుకు సాగుతోందని, ముస్లింలు మోదీకి అండగా నిలవాలని కోరారు. మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఫజల్‌, పట్టణాధ్యక్షుడు ముజఫర్‌, క్రిస్టియన్‌ మైనార్టీ నేత జాన్‌ సుందర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని