logo

కళతప్పిన ప్రకృతి సోయగం..అటకెక్కిన పర్యాటకం!

ఎటుచూసినా పచ్చదనం.. అందమైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదాన్ని పంచింది ఆ కేంద్ర నర్సరీ. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకప్పుడు కళకళలాడిన నార్సింగి మండలం వల్లూరులోని కేంద్ర నర్సరీ అధ్వానంగా మారింది. 16 ఏళ్ల కిందటి వరకు నిత్యం విద్యార్థులు, అధికారులు ఇక్కడికి వచ్చేవారు.

Published : 20 Jan 2022 01:28 IST

వల్లూరు కేంద్ర నర్సరీ తీరు

న్యూస్‌టుడే, నార్సింగి (చేగుంట)


నర్సరీ ప్రధాన ద్వారం

ఎటుచూసినా పచ్చదనం.. అందమైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదాన్ని పంచింది ఆ కేంద్ర నర్సరీ. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకప్పుడు కళకళలాడిన నార్సింగి మండలం వల్లూరులోని కేంద్ర నర్సరీ అధ్వానంగా మారింది. 16 ఏళ్ల కిందటి వరకు నిత్యం విద్యార్థులు, అధికారులు ఇక్కడికి వచ్చేవారు. అప్పట్లో రూ.6 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపించి రూపుకోల్పోయింది. వల్లూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారి పక్కనే 2001లో కేంద్ర నర్సరీని ఏర్పాటు చేశారు. మొక్కలు పెంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడంతో పాటు ఈ ప్రాంతానికి పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సకల హంగులతో తీర్చిదిద్దారు. దీంతో ఇక ఆదివారం, సెలవు దినాల్లో సందడే కనిపించేది. ఇక్కడ చెక్‌డ్యాంలు, నీటి కొలను నిర్మించారు. జింకలు, కొండగొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు ఇతరత్రా జీవాలకు ఆవాసం కల్పించారు. 35 రకాల వివిధ ఔషధ మొక్కలను పెంచి వివిధ ప్రాంతాలకు తరలించేవారు. సమావేశం మందిరం నిర్మించారు. సౌకర్యాలు కల్పించడంతో నిత్యం పర్యాటకుల సందడి నెలకొనేది. క్రమేణా పర్యవేక్షణ తగ్గడంతో పచ్చదనం కాస్త మాయమైంది. అప్పుడప్పుడు కేంద్ర అటవీ అధికారులు సందర్శించి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పడమే తప్ప ఒక్క అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..

- రవిప్రసాద్‌, డీఎఫ్‌వో, మెదక్‌

వల్లూరు నర్సరీలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. అర్బన్‌ పార్కు తరహాలో అభివృద్ధి చేసేలా చొరవ చూపుతాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. నిధులు మంజూరవగానే రూపురేఖలు మారుస్తాం.


తర్ఫీదు బంద్‌..

నర్సరీలో మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలతో పాటు దూలపల్లి అటవీ అకాడమీకి చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, శిక్షణలో ఉండే ఎఫ్‌ఆర్వోలు, బీట్‌ అధికారులు వీఎస్‌ఎస్‌ సిబ్బందికి ఇక్కడ తర్ఫీదు ఇస్తుండేవారు. ఆ ప్రక్రియ బంద్‌ అయింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు బొటానికల్‌ టూర్‌లో భాగంగా ఇక్కడికి వస్తుండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది.

మొక్కల పెంపకానికి మాత్రమే..

ప్రస్తుతం నర్సరీలో 25 రకాల మొక్కలను పెంచుతున్నారు. ఇందుకు రూ.10 లక్షలు వెచ్చిస్తున్నారు. జిల్లాతో పాటు నిజామాబాద్‌, కామరెడ్డి, వరంగల్‌, సిద్దిపేట, సంగారెడ్డి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ అటవీ ప్రాంతాలకు వాటిని పంపిస్తున్నారు. మొక్కల పెంపకంలో వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఆదర్శంగా ఉండగా.. పర్యాటకాన్ని మాత్రం గాలికొదిలేశారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే మార్గంలో ఎక్కడా పర్యాటక స్థలాలు లేవు. ఈ తరుణంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే పూర్వవైభవం వచ్చే అవకాశం లేకపోలేదు. 2005 వరకు ప్రతి ఏటా నిధులు మంజూరయ్యాయి. తర్వాత వాటి ఊసే లేకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని