logo

మట్టి దందా.. కాసుల పంట!

మట్టి తవ్వకాలకు కాదేదీ అనర్హం అంటున్నారు అక్రమార్కులు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేపట్టి.. దూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జలవనరులతో పాటు అసైన్డ్‌ భూములను వదలడం లేదు. హిటాచీ, జేసీబీలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీంతో చెరువులు, కుంటలు రూపు కోల్పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు మట్టిని దోచేస్తున్నారు. కొన్ని చోట్ల అనుమతులు తీసుకున్నా పరిమితి కంటే అధిక మొత్తంలో తవ్వేసి....

Published : 21 Jan 2022 02:13 IST

అసైన్డ్‌ భూములు, జలవనరుల్లో తవ్వకాలు
యథేచ్ఛగా అక్రమ రవాణా..
- న్యూస్‌టుడే, శివ్వంపేట, నర్సాపూర్‌, టేక్మాల్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌,

పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, చిలప్‌చెడ్‌, రామాయంపేట, కొల్చారం

నర్సాపూర్‌లోని అల్లంవాణి కుంట తీరు

ట్టి తవ్వకాలకు కాదేదీ అనర్హం అంటున్నారు అక్రమార్కులు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేపట్టి.. దూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జలవనరులతో పాటు అసైన్డ్‌ భూములను వదలడం లేదు. హిటాచీ, జేసీబీలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీంతో చెరువులు, కుంటలు రూపు కోల్పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు మట్టిని దోచేస్తున్నారు. కొన్ని చోట్ల అనుమతులు తీసుకున్నా పరిమితి కంటే అధిక మొత్తంలో తవ్వేసి తరలిస్తుండటం గమనార్హం. డిమాండ్‌ బట్టి ఒక్కోచోట ఒక్కో ధరతో అమ్ముకుంటూ జేబులో వేసుకుంటున్నారు. శివ్వంపేట మండలం బిజిలీపూర్‌లో ట్రాక్టర్‌ మట్టి రూ.400కు నర్సాపూర్‌లో రూ.500 మనోహరాబాద్‌లో రూ.700 వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల పలు గ్రామాల్లో స్థానికులు మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకొని పోలీసులకు అప్పగించడం గమనార్హం. అప్పటికప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇసుకగా మార్చి..
శివ్వంపేట మండలం గుండ్లపల్లి, నవాబ్‌పేట, సికింద్లాపూర్‌, దొంతి, బోజ్యతండా, బిజిలీపూర్‌, టిక్యాదేవమ్మ గూడెం గ్రామాల్లో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రుళ్లు అసైన్డ్‌ భూముల్లో తవ్వి.. కొన్ని పరిశ్రమలకు తరలిస్తున్నారు. బిజిలీపూర్‌, దొంతి, తదితర చోట్ల మట్టిని ఫిల్టర్‌ చేసి ఇసుకగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.  

గుండ్లపల్లి వాగులో..

నిత్యకృత్యంగా..
మనోహరాబాద్‌ మండలం కూచారం, కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి పారిశ్రామికవాడల్లో రాత్రివేళ అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. రాత్రి 10 గంటల తర్వాత మట్టిని తరలిస్తున్నారు. దీంతో అక్రమార్కులు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. తూప్రాన్‌ మండలం నాగులపల్లి, ఒట్టూరు, బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువుల్లో మట్టి తవ్వించి హైదరాబాద్‌తో పాటు పారిశ్రామిక ప్రాంతానికి తరలిస్తున్నారు. రామాయంపేట మండలంలోని పలు అసైన్డ్‌ భూముల్లోనూ దందా సాగుతోంది.
పెద్దశంకరంపేట మండలం కమలాపురం, కట్టెల వెంకటాపురం గ్రామాల శివారులోని భూముల్లో యథేచ్ఛగా మొరం తవ్వి ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు.
చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి-నార్సింగి వరకు రోడ్ల నిర్మాణంలో వినియోగించేందుకు ఎక్కడపడితే అక్కడ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.
టేక్మాల్‌తో పాటు ఎల్లంపల్లి శివారులోని గుట్టల్లో కొందరు అనుమతి లేకుండా మొరం తవ్వేసి తరలిస్తున్నారు. గుట్టలు సైతం తరిగిపోవడం గమనార్హం.

టేక్మాల్‌ మండలం ఎల్లంపల్లి శివారులో..

ఆలయ భూముల్లో..
నర్సాపూర్‌లో ప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ భూముల్లో నిత్యం మట్టి అక్రమ రవాణా సాగుతోంది. సెలవు దినాల్లో మరింత జోరుగా సాగుతోంది. అల్లంవాణి, మల్పర్తి కుంటల్లో తవ్వకాలు జరిపి పట్టణంలో నిర్మిస్తున్న భవనాలు, వెంచర్ల యజమానులకు విక్రయిస్తున్నారు. నర్సాపూర్‌ నుంచి కాగజ్‌మద్దూర్‌, హైదరాబాద్‌ వెళ్లే మార్గాల్లోని ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో పలు చోట్ల లోతైన గుంతలు కనిపిస్తున్నాయి.


చర్యలు తీసుకుంటాం...
- జయరాజ్‌, జిల్లా ఏడీ, మైనింగ్‌

ప్రభుత్వ నిర్మాణాలు, నర్సరీలు, పీఆర్‌, ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణాలకు మట్టిని వినియోగిస్తే సీనరైజ్‌ ఛార్జీలు ప్రభుత్వానికి జమ చేస్తారు. ఎక్కడైనా అక్రమంగా తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో నిఘావేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చొరవ చూపుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని