logo

దుకాణదారులకు ఉపశమనం!

పట్టణ ప్రాంతాల్లో దుకాణదారులకు ఊరట కలిగించేలా పురపాలిక శాఖ నిర్ణయం తీసుకుంది. రహదారి వెడల్పు, దుకాణ విస్తీర్ణాన్ని బట్టి ట్రేడ్‌లైసెన్స్‌ రుసుం వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత వరకు దుకాణం ఎక్కడ ఉన్నా ఒకే రకమైన రుసుం ఉండేది.

Published : 23 Jan 2022 02:59 IST

ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుం నిర్ణయానికి కొత్త విధానం

న్యూస్‌టుడే, మెదక్‌: పట్టణ ప్రాంతాల్లో దుకాణదారులకు ఊరట కలిగించేలా పురపాలిక శాఖ నిర్ణయం తీసుకుంది. రహదారి వెడల్పు, దుకాణ విస్తీర్ణాన్ని బట్టి ట్రేడ్‌లైసెన్స్‌ రుసుం వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత వరకు దుకాణం ఎక్కడ ఉన్నా ఒకే రకమైన రుసుం ఉండేది. కొత్త విధానంతో ప్రధాన రహదారుల పక్కన కాకుండా కాలనీల్లో దుకాణాలు నిర్వహించేవారికీ ఉపశమనం లభించినట్లయింది. రుసుం నిర్ణయించే బాధ్యతను ప్రభుత్వం పురపాలికలకే ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు నిర్వహించే వారు తప్పకుండా మున్సిపల్‌ కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి ధ్రువపత్రం అందజేస్తారు. ఏటా కొంత పన్నును బల్దియాకు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది దుకాణాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ట్రేడ్‌ లైసెన్స్‌ పొందడంలో కొంత జాప్యం చేస్తున్నారు. అధికారులు తనిఖీల సమయంలోనే లైసెన్స్‌ లేని విషయం బయటపడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న నాలుగు పురపాలికల్లో ట్రేడ్‌లైసెన్సుల ద్వారా రూ.27లక్షల ఆదాయం లభిస్తోంది. జిల్లాలోని ఆయా పురపాలికల్లో తొలుత ఒక వరుస, రెండు వరుసల రహదారులను గుర్తించనున్నారు. దుకాణాల వైశాల్యంలో చదరపు గజానికి రూ.4 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తారు. ఒక్కో దానికి రూ.వేయి నుంచి రూ.10 వేల వరకు నిర్ణయించే అవకాశం ఉంది. పట్టణంలో ఒక వరుస రోడ్డు ఉన్న ప్రాంతంలోని దుకాణాలకు చదరపు గజానికి రూ.5 చొప్పున, రెండు వరుసలు ఉన్న ప్రాంతాల్లో చదరపు గజానికి రూ.20 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేటల్లో ఎక్కువ శాతం రెండు వరుసల రహదారులున్నాయి.

సమకూరనున్న ఆదాయం

పురపాలిక పరిధిలో ప్రధాన రహదారికి ఆనుకొని వందల్లో, వీధుల్లో పెద్దసంఖ్యలో దుకాణాలు ఉంటాయి. ప్రస్తుతం అన్ని పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాల ద్వారా రూ.500 నుంచి రూ.1500 వరకు రుసుం వసూలు చేస్తూ ట్రేడ్‌ లైసెన్సులను జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో సమగ్ర సర్వే చేపట్టి ఫీజులు నిర్ణయిస్తే పురపాలక సంఘాలకు ఆదాయం పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని