logo

ఇటుక బట్టీ.. నిబంధనలు కట్టిపెట్టి..!

దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో యథేచ్ఛగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు కలిసి వస్తోంది. వాస్తవానికి ఇటుక బట్టీల నిర్వహణకు రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌, భూగర్భ గనులు, అటవీ,

Published : 27 Jan 2022 01:43 IST

బీళ్లుగా మారుతున్న పచ్చని పొలాలు
న్యూస్‌టుడే, మిరుదొడ్డి

అల్వాలలో నడుస్తున్న ఇటుక బట్టీ

దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో యథేచ్ఛగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు కలిసి వస్తోంది. వాస్తవానికి ఇటుక బట్టీల నిర్వహణకు రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌, భూగర్భ గనులు, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్తు శాఖల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండానే వాటిని ఏర్పాటు చేస్తుండగా ఆయా శాఖల అధికారులు చూసీ చూడనట్లు వెళుతుండగా లాభసాటి వ్యాపారం కావడంతో ఎక్కడ పడితే అక్కడ ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాల్లో దాదాపు 28 వరకు ఇటుక బట్టీలు నడుస్తుండగా ఏ ఒక్కదానికి కూడా అనుమతులు లేకపోవడం విశేషం. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు అల్వాల, భూంపల్లి, అక్బర్‌పేట, పెద్ద చెప్యాల, దౌల్తాబాద్‌ మండలంలో కోనాపూర్‌, ముబారస్‌పూర్‌, దుబ్బాక పురపాలిక పరిధిలో చీకోడు, బల్వంతాపూర్‌, దుంపలపల్లి, తొగుట మండలంలో కాన్గల్‌, రాయపోల్‌ మండలంలోని వడ్డెపల్లి గ్రామాల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నాయి.

ఇటుక బట్టీల నిర్వాహకులు అవలంబిస్తున్న విధానాలన్నీ అక్రమమే. బట్టీ ఏర్పాటుకు కనీసం రెండు నుంచి అయిదెకరాల వరకు భూమి అవసరం. ఆయా పంచాయతీల పరిధిలో రెవెన్యూ శాఖ అనుమతులు తప్పనిసరి. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొంత డబ్బు ముట్టజెప్పి ఇటుక బట్టీలు నెలకొల్పుతున్నారు. వ్యవసాయేతర పనులకు భూమిని వినియోగిస్తున్నందున నాలా పన్ను చెల్లించాలి. భూగర్భ గనుల శాఖ నుంచి సైతం అనుమతులు పొందాలి. తహసీల్దారు కార్యాలయం, కాలుష్య నియంత్రణ అధికారి నుంచి అనుమతి పత్రం పొందాలి. ఇవేవి లేకపోగా...ప్రభుత్వ స్థలాలు, వాగులు, చెరువుల నుంచి వాల్టాను (నీరు, చెట్టు, భూమి చట్టం) ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వుతూ ఇటుకల తయారీకి మట్టిని తరలిస్తున్నారు.

ఉచిత విద్యుత్తు దుర్వినియోగం
అన్నదాతలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీ ప్రదేశంలో ప్రత్యేకంగా బోరు వేసుకుని మోటారు నడుపుకునేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకొని కనెక్షన్‌ పొందాలి. అందుకు మూడు నెలలకు రూ.11 వేల వరకు చెల్లించాల్సి ఉండగా నిబంధనలు తోసిరాజని సమీప వ్యవసాయ భూముల్లో ఉన్న బోరు మోటార్లను లీజుకు తీసుకొని ఉచిత విద్యుత్తును దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయమై ఆయా మండలాల తహసీల్దార్లను వివరణ కోరగా.. అక్రమ ఇటుక బట్టీలపై ఆరా తీస్తామన్నారు. ఒక్కదానికి కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వాటిపై సమాచారం తెప్పించుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. మైనింగ్‌ అధికారుల అనుమతి లేకుండా బట్టీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని