logo

అభ్యసన సామర్థ్యం.. భవితకు మార్గం

విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు తగ్గాయి. గతంలో కరోనాతో ఏడాదిన్నర పాఠశాలలు మూసి ఉండడం.. గతేడాది తరగతులు నిర్వహించినా.. పాఠాలు పూర్తిస్థాయిలో చెప్పకపోవడంతో పిల్లలు చదువులో వెనుకబడ్డారు. ఇటీవల నిర్వహించిన

Published : 25 Jun 2022 01:25 IST

విద్యార్థులకు నేర్పించడంపై దృష్టి సారించాలని విద్యాశాఖ ఆదేశం

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు తగ్గాయి. గతంలో కరోనాతో ఏడాదిన్నర పాఠశాలలు మూసి ఉండడం.. గతేడాది తరగతులు నిర్వహించినా.. పాఠాలు పూర్తిస్థాయిలో చెప్పకపోవడంతో పిల్లలు చదువులో వెనుకబడ్డారు. ఇటీవల నిర్వహించిన న్యాస్‌ పరీక్షల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. జిల్లాలో కొన్ని పాఠశాలలు బేసిక్స్‌ పేరుతో విద్యార్థులకు గతేడాది తరగతి పాఠాలతో పాటు.. ప్రాథమిక అంశాలు నేర్పించడం ప్రారంభించారు. ఇది ఆయా పాఠశాలల్లో విజయవంతం కావడంతో.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్‌ ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కథనం.

ప్రత్యేక తరగతుల నిర్వహణ

జిల్లాలో 846 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత, 203 ఉన్నత, 5 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1.22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు విద్యా సామర్థ్యాల్లో వెనుకబడి ఉండడంతో రెగ్యులర్‌ పాఠాలతో.. వారికి బేసిక్స్‌ నేర్పించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి రోజు రెగ్యులర్‌ పాఠాలతో పాటు.. ప్రత్యేక తరగతులు, తర్ఫీదు ఇవ్వాలని సూచించింది. మొదట విద్యార్థులకు పాఠ్యాంశాలపై ప్రత్యేక పరీక్ష నిర్వహించాలి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయాలి. పిల్లలు ఎందులో వెనుకబడ్డారో గుర్తించి.. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆయా పాఠశాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం నెల రోజుల పాటు పిల్లలకు ప్రత్యేక బోధన చేయాలి. విద్యార్థులతో సాధన చేయించాలి. చివరి రోజు మళ్లీ పరీక్ష నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలు ఎంత వరకు మెరుగు పడ్డాయో తెలుసుకోవాలి. అప్పటికీ.. సత్ఫలితాలు రాకుంటే.. మళ్లీ కొన్ని రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.

చదువులో ముందుండాలన్నదే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదువులో ముందుండాలన్నదే విద్యాశాఖ లక్షం. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఈ ఏడాది వెయ్యి మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రైవేట్‌ నుంచి వచ్చిన విద్యార్థులు చదువులో కొంచెం ముందున్నారు. మొదటి నుంచి ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు కూడా బేసిక్స్‌పై పట్టు సాధించి రెగ్యులర్‌ తరగతి పాఠాలు అర్థం చేసుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

పక్కాగా అమలు చేస్తాం..:  రాజేశ్‌, జిల్లా విద్యాధికారి

పునాది, త్రీఆర్స్‌ పేరుతో విద్యార్థులకు బేసిక్స్‌ నేర్పించాలని ఆదేశాలు ఇచ్చాం. రెగ్యులర్‌ తరగతులో పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలి. అన్ని పాఠశాలల్లో పక్కాగా అమలు చేసేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. మండల విద్యాధికారులు నిత్యం పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థులు బేసిక్స్‌పై పూర్తిగా పట్టు సాధిస్తేనే రెగ్యులర్‌ తరగతులు అర్థమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని