logo

ఆర్టీసీకి కలిసొచ్చిన జూన్‌!

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి జూన్‌లో ఆదాయం పెరగడం ఊరటనిచ్చింది. సంస్థ ఎండీగా ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదాయం రాబట్టేందుకు పలు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే వేసవి సెలవులు, వివాహాలకు ప్రత్యేక రాయితీలు, వి

Published : 05 Jul 2022 01:48 IST

మెదక్‌ డిపోకు రూ.4.79 కోట్ల ఆదాయం

న్యూస్‌టుడే, మెదక్‌ అర్బన్‌

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి జూన్‌లో ఆదాయం పెరగడం ఊరటనిచ్చింది. సంస్థ ఎండీగా ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదాయం రాబట్టేందుకు పలు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే వేసవి సెలవులు, వివాహాలకు ప్రత్యేక రాయితీలు, వివిధ సందర్భాలలో ప్రత్యేక సర్వీసులు, కార్గో సేవలు వంటివి ప్రవేశపెట్టారు. జిల్లా కేంద్రం మెదక్‌ డిపోనకు ఆయా సేవల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో గత జూన్‌లో రూ.4.79 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక ఆదాయం కావడం గమనార్హం. మేలో రూ.4.24 కోట్లు వచ్చింది.

శుభకార్యాలతో పెరిగిన ప్రయాణాలు..

జూన్‌లో శుభ ముహూర్తాలు అధికంగా ఉండటం ఆర్టీసీకి కలిసొచ్చింది. జిల్లాలో వివాహాది శుభకార్యాలు అత్యధికంగా జరిగాయి. మరో నాలుగైదు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఎంతోమంది గత నెలలోనే పెళ్లిళ్లు జరిపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ రాయితీ సదుపాయాన్ని కల్పించడంతో ఎంతోమంది సేవలు వినియోగించుకున్నారు. యాత్రలకు, వివాహాలకు వెళ్లిన వారి సంఖ్య పెరగడంతో ఆదాయానికి మార్గం ఏర్పడింది.

తిరుమలేశుడి దర్శనం..

తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా వారం రోజుల ముందుగా బస్సు టికెట్‌ బుక్‌ చేసుకుంటే దాంతో పాటు స్వామి ప్రత్యేక దర్శనం టికెట్‌ పొందే సదుపాయాన్ని సైతం ప్రారంభించింది. దీనికి అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిత్యం మెదక్‌ నుంచి తిరుపతికి సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసు నడుపుతోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని