logo

ప్లాట్ల క్రమబద్ధీకరణపై ఆశలు..!

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) మళ్లీ తెరపైకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. రెండేళ్ల కిందట నిలిపివేసిన అనధికార లేఅవుట్‌ స్థలాల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లతో పాటు భవన నిర్మాణాల ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Published : 03 Oct 2022 00:45 IST

న్యూస్‌టుడే, మెదక్‌, నర్సాపూర్‌

జిల్లా కేంద్రంలో అనుమతి లేని లేఅవుట్‌

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) మళ్లీ తెరపైకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. రెండేళ్ల కిందట నిలిపివేసిన అనధికార లేఅవుట్‌ స్థలాల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లతో పాటు భవన నిర్మాణాల ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అక్రమ లేఅవుట్లలో నిబంధనల మేరకు ఉన్న వాటిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తద్వారా బల్దియాలకు ఆదాయం సమకూరనుంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జిల్లా అతి సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళ్తుండటంతో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇదే క్రమంలో అక్రమ లేఅవుట్లు భారీగా వెలిశాయి. పురపాలిక, గ్రామపంచాయతీ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో స్థిరాస్తి వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో అక్రమ/అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని 2020 జులైలో ఉత్తర్వులు ఇచ్చింది.

నర్సాపూర్‌లో అనుమతి లేని లేఅవుట్‌లో నిర్మాణాన్ని కూల్చివేస్తున్న అధికారులు

96 మేర అక్రమ లేఅవుట్లు
ఇదే క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్‌ రూపంలో క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు సర్వే చేపట్టి జిల్లాలో 96 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు పురపాలికల్లో 84, గ్రామాల్లో 12 అనధికారికంగా ఉన్నాయని తేల్చారు. పురపాలిక, పంచాయతీరాజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండా, ఖాళీ స్థలాలు వదలకుండా పదుల సంఖ్యలో లేఅవుట్లను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో ప్లాట్లు కొన్న యజమానులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

18,100 దరఖాస్తులు
రెండేళ్ల కిందట జిల్లాలోని నాలుగు పురపాలికల పరిధిలో క్రమబద్ధీకరణకు వందలాది దరఖాస్తులు వచ్చాయి. ప్లాట్ల యజమానులు రూ.వేయి, లేఅవుట్‌ చేసిన వారు రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వచ్చిన 18,100 దరఖాస్తుల్లో నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మోక్షం కలిగించనున్నారు. అధికారులు సమాయత్తం అవుతున్నారు.

నిబంధనల ప్రకారం..
తాజాగా ప్రభుత్వం జారీ చేసిన 131 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాలు, ఆలయ భూములు, పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం, మిగులు భూములు, చెరువు శిఖం భూముల్లో ఉన్న ప్లాట్ల లేఅవుట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదనే నిబంధన విధించారు. లేఅవుట్లలో పది శాతం ప్లాట్లు విధిగా రిజిస్ట్రేషన్‌ చేసి ఉండాలన్న నిబంధన అమలు చేయనున్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts