logo

రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకొస్తా..

ఆరేళ్లు తెరాస ఎమ్మెల్యే దుబ్బాక ప్రజల చెవుల్లో పూలు పెట్టగా, ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మరో అడుగు ముందుకేసి కాలీప్లవర్లు పెడుతున్నాడని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

Published : 05 Oct 2022 00:59 IST

వైతెపా అధ్యక్షురాలు షర్మిల


చేగుంటలో ప్రజలతో షర్మిల

చేగుంట, చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: ఆరేళ్లు తెరాస ఎమ్మెల్యే దుబ్బాక ప్రజల చెవుల్లో పూలు పెట్టగా, ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మరో అడుగు ముందుకేసి కాలీప్లవర్లు పెడుతున్నాడని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. మంగళవారం షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చిన్నశంకరంపేట మండలం రుద్రారం, చందంపేట గ్రామాల మీదుగా చేగుంట వరకు కొనసాగింది. పొలంపల్లి వద్ద దివ్యాంగుడితో మాట్లాడారు. చేగుంటలో జరిగిన సభలో మాట్లాడుతూ.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు నిరుద్యోగభృతి ఇస్తానని, దుబ్బాకకు రైలు తెస్తానని, పరిశ్రమలు తెస్తానని హామీ ఇచ్చారని, వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల సమయంలో దుబ్బాకలో కుటుంబీకులతో కలిసి ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి.. అమీర్‌పేటలో కార్పొరేట్‌ ఆసుపత్రి ఏర్పాటుచేశారని విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను బీర్ల రాష్ట్రంగా మార్చారాని ఆరోపించారు. కాంగ్రెస్‌, భాజపాలు తెరాసతో కుమ్మక్కయ్యాయని, అందుకే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో వైతెపా అధికారంలోకి రాగానే వైఎస్సార్‌ పథకాలను తిరిగి తెస్తానని హామీ ఇచ్చారు. రాజన్న పాలన తీసుకొస్తానని, తెరాస ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ ప్రతినిధి శ్రీనివాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, నాయకులు శ్రీనివాస్‌, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* ప్రజాప్రస్థాన పాదయాత్రను అడ్డుకునేందుకు తెరాస నాయకులు ప్రయత్నించారు. షర్మిల చేగుంటకు చేరుతుందనగా తెరాస నాయకులు గాంధీ చౌరస్తా వద్ద నిర్వహించే సభ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గోబ్యాక్‌ షర్మిల అంటూ నినదించారు. అక్కడే ఉన్న రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట ఎస్‌ఐలు నర్సింలు, రాజేష్‌, శ్రీనివాస్‌రెడ్డి వారించే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. వారిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని ఠాణాకు తరలించారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని