logo

వెనుకడగు లేని జీవనం!

మనో నిబ్బరం ఉంటే దేనినైనా సాధించవచ్చు. ప్రమాదంలో ఒక కాలు, ఒక చేయి కోల్పోయినా ధైర్యంగా జీవనం సాగిస్తున్నారు. మెదక్‌ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌.

Published : 03 Dec 2022 01:23 IST

కారు నడుపుతున్న శ్రీనివాస్‌

న్యూస్‌టుడే, నార్సింగి(చేగుంట): మనో నిబ్బరం ఉంటే దేనినైనా సాధించవచ్చు. ప్రమాదంలో ఒక కాలు, ఒక చేయి కోల్పోయినా ధైర్యంగా జీవనం సాగిస్తున్నారు. మెదక్‌ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌. విద్యుదాఘాతంతో గతంలో చేయి, కాలు కోల్పోయారు. ప్రస్తుతం వాహనాలు నడుపుతున్నారు. గ్రామపంచాయతీలో తాత్కాలిక కార్మికుడిగా వీధి దీపాలు బిగించేవారు. పెళ్లయిన ఏడాదికే 2005లో స్తంభంపై విద్యుదాఘాతానికి గురయ్యారు. కాలు, చేయి తొలగించారు. కొన్నాళ్లకు బాధపడితే ప్రయోజనం లేదని గ్రహించారు. భార్య సుజాత వెన్నంటి ఉంటున్నారు. చికిత్స సమయంలో రూ.ఐదు లక్షల ఖర్చులకు ఉన్న ఎకరం పొలాన్నీ అమ్మేశారు. మరో రూ.2.50 లక్షల అప్పులయ్యాయి. అప్పులైనా, అవయవాలు పోయినా ప్రాణం మిగిలిందనుకొని ముందడుగు వేస్తున్నారు. 2006లో బీసీ కార్పొరేషన్‌ నుంచి రూ.50 వేల రుణం తీసుకొని కిరాణా దుకాణం ప్రారంభించారు. దాతల సహకారంతో కృత్రిమ కాలును తయారు చేయించుకున్నారు. ద్విచక్ర వాహనం, కారు నడిపించ గలుగుతారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భార్య సుజాత తరఫున ప్రచారం చేశారు. ఆమె సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆటో గేర్‌ కారు కొనుక్కొని నార్సింగి, రామాయంపేట, చేగుంట, మెదక్‌, హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంటారు. ఒంటి కాలుతోనే క్లచ్‌, బ్రేక్‌ వాడుతారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నాడు. గ్రామంలో కృత్రిమ కాలుతోనే నడక చేపట్టి పనులు చేసుకుంటారు. గ్రామంలో ఎవరైనా పేద ఇంటి వారు చనిపోతే రూ.5 వేల ఆర్థిక సాయం చేస్తుంటారు. పెళ్లి కూతుళ్లకు పుస్తెమెట్టెలు, దుస్తులు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని