logo

నిర్భయంగా మాట్లాడి.. తానేంటో నిరూపించుకొని..

ఠక్కున స్పందించిన శ్రీవర్షిణి.. ‘నేను 8వ తరగతిలో ఉన్నపుడే బోస్‌ చరిత్ర చదివా. వారి వ్యక్తిత్వం ఎంతో గొప్పది.’

Published : 29 Jan 2023 03:10 IST

ప్రధానితో సిద్దిపేట విద్యార్థిని  
న్యూస్‌టుడే, సిద్దిపేట

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శ్రీవర్షిణి (కుడివైపు రెండో వ్యక్తి)

ఠక్కున స్పందించిన శ్రీవర్షిణి.. ‘నేను 8వ తరగతిలో ఉన్నపుడే బోస్‌ చరిత్ర చదివా. వారి వ్యక్తిత్వం ఎంతో గొప్పది.’ అంటూ ఆంగ్లంలో రెండు నిమిషాలు మాట్లాడారు. ఈ సమాధానమే పార్లమెంట్‌కు తీసుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ (హెచ్‌పీ ఎంసీజే) ప్రథమ సంవత్సర విద్యార్థిని శ్రీవర్షిణి సాధించిన ఘనత ఈనెల 23న నేతాజీ జయంతి పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్రం (ఎన్‌వైకే) తరఫున రాష్ట్రం నుంచి పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. దిల్లీలో ఐదు రోజుల యాత్ర పూర్తి చేసుకొని సిద్దిపేటకు తిరిగిరాగా ‘న్యూస్‌టుడే’ పలకరించింది. ఆమె మాటల్లోనే...  

మాది సిద్దిపేట. నాన్న వేణుమాధవ్‌ ఎలక్ట్రిక్‌ వ్యాపారి. అమ్మ నాగలక్ష్మి కస్తూర్బా ఉపాధ్యాయురాలు. చెల్లి సౌధామిని. విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. ప్రస్తుతం ఆసక్తి ఉన్న జర్నలిజం అనుబంధ కోర్సు చదువుతున్నా. విభిన్న అంశాల్లో రాణించాలని ఉంటుంది. క్విజ్‌, ఉపన్యాసం, వ్యాసరచన, క్రీడా పోటీల్లో పాల్గొంటా. ఎనిమిదో తరగతి చదివే సమయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నా. ఎన్‌వైకే తరఫున నిర్వహించిన వక్తృత్వ పోటీ.. కీలక మలుపుతిప్పింది. ఈనెల 9న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రసంగించా. ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయిలో పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌కు వెళ్లే అవకాశం దక్కించుకున్నా. ఎన్‌వైకే తరఫున వివిధ రాష్ట్రాల నుంచి ఒకరు చొప్పున మొత్తం 27 మంది ఎంపికవగా.. అందులో తెలంగాణ నుంచి నేను ఒక్కరినే. ఈనెల 23న పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌కు వెళ్లాం. అక్కడికి చేరుకున్న ప్రధాని అభివాదం చేశారు. తరువాత పీఎం కార్యాలయంలో ‘మీ నాయకుడు తెలుసా’ అంశంపై ఇంటరాక్షన్‌ జరిగింది. 40 నిమిషాలు గడిపాం. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చా. వారితో కలిసి గ్రూపు ఫొటో దిగాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడి వేడుకలు తిలకించా. అమ్మానాన్నలు చదువుతో పాటు నచ్చిన రంగాల్లో రాణించాలంటూ ప్రోత్సహిస్తున్నారు. నాకు ఉపన్యాసమంటే అమితాసక్తి. ఆడపిల్లలు నిర్భయంగా మాట్లాడాలి. సరైన నిర్ణయం తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని