logo

ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు

ఈనెల 21న టేక్మాల్‌ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్‌లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు.

Published : 28 Mar 2024 01:32 IST

మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు

యేసు

టేక్మాల్‌, న్యూస్‌టుడే: ఈనెల 21న టేక్మాల్‌ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్‌లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని తంపులూరు గ్రామానికి చెందిన దుబ్బగళ్ల సంగమ్మ(44) భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తుండడంతో సొంతింట్లోనే ఒంటరిగా ఉంటోంది. ఈనెల 21వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. వట్‌పల్లి మండలం మరవెల్లి గ్రామానికి చెందిన మల్లగుల్ల యేసు(38)కు సంగమ్మ చిన్నమ్మ అవుతుంది. అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈనెల 20వ తేదీన జోగిపేటలో పనిఉందని బైకుపై వెళ్లి వద్దామని యేసుని ఇంటికి పిలిచింది. ఇద్దరు కలిసి జోగిపేటకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చారు. రాత్రికి అతను చిన్నమ్మ ఇంట్లోనే నిద్రించాడు. ఆమెను చంపితే తమ బంధువులకు ఆస్తి దక్కుతుందని భావించి 21వ తేదీ తెల్లవారుజామున ఇంట్లోని సుత్తితో తలపై బాది హత్య చేశాడు. ఇంట్లోని బంగారు ఆభరణాలను తీసుకొని పరారయ్యాడు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె చరవాణి కాల్‌డేటా ఆధారంగా నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


నీట మునిగి యువకుడి మృతి

సిద్ధిరాములు

పాపన్నపేట, న్యూస్‌టుడే: నీట మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలోని మంజీరా చెక్‌డ్యాంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేష్‌ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన గుడ్ల సిద్ధిరాములు(28) హమాలీగా జీవనం సాగిస్తున్నాడు. దుర్గమ్మ దర్శనానికి మంగళవారం తోటి వారితో కలిసి ఏడుపాయలకు వచ్చాడు. అదే రోజు సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెక్‌డ్యామ్‌ వద్దకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. అక్కడే ఉన్నవారు గమనించి వెతికి, రాత్రి సమయంలో మృతదేహాన్ని వెలికితీసి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బుధవారం భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

మహమ్మద్‌ బందేలి

మనూరు, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచలో చోటుచేసుకుంది. మనూరు ఎస్సై అంబార్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బోరంచకు చెందిన మహమ్మద్‌ బందేలి(28) ఉపాధి నిమిత్తం కుటుంబంతోసహా కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఇటీవల గ్రామానికి వచ్చాడు. అప్పులు పెరిగిపోవడంతో మానసిక ఒత్తిడికి లోనయిన బందేలి బుధవారం పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. బందేలి అన్న ఖాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


మనస్తాపంతో యువకుడు..

శశికుమార్‌

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: అనారోగ్యానికి గురైన యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించి, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండల పరిధి అంబాజీపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై నారాయణ తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన శశికుమార్‌(26) ఉప్పరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో మనస్తాపానికి గురై గత శనివారం పురుగుమందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. శశికుమార్‌ అన్న రాజేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని