logo

కొత్త రేషన్‌కార్డులకు.. కోడ్‌ అడ్డంకి

ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది.

Updated : 28 Mar 2024 04:31 IST

న్యూస్‌టుడే-మెదక్‌, శివ్వంపేట: ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. ఇలా పలు రకాలుగా ఇబ్బందులు ఉండడంతో చాలా మంది రేషన్‌ కార్డు కోసం అర్జీ పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలో ఐదు గ్యారంటీలను అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డుల జారీకి పచ్చజెండా ఊపింది. అయితే ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. దరఖాస్తుకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఉత్తర్వులు లేదా ఆన్‌లైన్‌ నమోదుకు అవకాశం లభించలేదు. దీంతో చాలా మంది ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2.13 లక్షల కార్డులున్నాయి. అత్యధిక శాతం మందికి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు పొందేందుకు అడ్డంకిగా మారుతోంది. దీంతో అప్పులు చేసి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పదేళ్లలో రెండు సార్లు మాత్రమే...: రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. దాని ప్రకారం ఒకసారి ఆహారభద్రత కార్డులు, పింఛన్లు జారీ చేశారు. ఆ తర్వాత కొత్తవాటి జోలికి వెళ్లలేదు. అనంతరం పలువురు నూతన కార్డులతో పాటు, కుటుంబ సభ్యుల నమోదుకోసం అర్జీ పెట్టుకున్నారు. దీంతో 2021 ఆగస్టులో నూతన కార్డులకు ఆమోదం తెలిపారు. జిల్లాలో 3,368 కార్డులను జారీ చేశారు. అనంతరం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చాలా మందికి కార్డులు అందలేదు. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో సోదరులు విడిపోయి వేరు కాపురాలు పెట్టడం, తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉండడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.  దీంతో ఆ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించింది. ఆయా పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు రేషన్‌కార్డు జతపర్చాలని సూచించింది. చాలా మందికి కార్డులేక పథకాలకు దూరమయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పభుత్వం కొత్త కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 14,548 మంది  దరఖాస్తులు సమర్పించారు.

మంజూరు ఇప్పట్లో లేనట్టే...: నూతన కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది .దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఫలితంగా కొత్తగా కార్డులు మంజూరుచేసే అవకాశం ఉండదు.


తొమ్మిదేళ్ల నుంచి అవకాశం రాలేదు

వెంకట్‌రెడ్డి, గోమారం, శివ్వంపేట

నాకు 2015లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కార్డు కోసం ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా. కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆశలు చిగురించాయి. వెంటనే దరఖాస్తుకు అవకాశం కల్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని