logo

బడులకు నిర్వహణ నిధులు

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది.

Published : 28 Mar 2024 02:08 IST

రెండో విడతగా రూ.4.35కోట్ల విడుదల

అక్కన్నపేట మండలం రామవరంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మిగతా 50శాతం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు క్రీడల నిర్వహణ, మండల విద్యా వనరుల కేంద్రాలు, క్లస్టర్‌ పాఠశాల సముదాయాలకు కూడా నిధులు మంజూరయ్యాయి.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏటా రెండు విడతలుగా నిధులు అందిస్తుంది. విద్యార్థుల సంఖ్య 1-30వరకు ఉంటే రూ.10వేలు, 31-100లోపు ఉంటే రూ.25వేలు, 101-250వరకు ఉంటే రూ.50వేలు, 251-1000 వరకు ఉంటే రూ.75వేల చొప్పున సంవత్సరానికి మంజూరు చేస్తుంది. మొదటి విడత కింద సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రూ.4.35కోట్లు మంజూరు కాగా రెండో విడత కింద కూడా అంతే మొత్తంలో విడుదలయ్యాయి. ఈ నిధులను విద్యుత్తు బిల్లులు, తాగునీరు, పాఠశాలకు సంబంధించి చిన్నచిన్న మరమ్మతులు, చాక్‌పీసులు, రిజిస్టర్లు, ఇతర రికార్డుల కొనుగోలు, పరీక్షల నిర్వహణ, జాతీయ పండగల నిర్వహణ తదితర అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది.

ఎంఆర్‌సీలకు రూ.74 వేల చొప్పున

స్కూల్‌ గ్రాంట్‌తో పాటు మండల విద్యా వనరుల కేంద్రాలకు, స్కూల్‌ కాంప్లెక్స్‌ పాఠశాలలకు, క్రీడల నిర్వహణకు నిధులు మంజూరయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 24 మండల విద్యావనరుల కేంద్రాలు ఉండగా ఒక్కో దానికి రూ.74వేల చొప్పున మంజూరయ్యాయి. జిల్లాలో 68 క్లస్టర్‌ పాఠశాలల సముదాయాలు ఉండగా ఒక్కోదానికి రూ.28వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీటితో పాటు క్రీడల నిర్వహణకు ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున జిల్లాలోని అన్ని పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా నిధుల విడుదలలో జాప్యం జరగడం, నిధుల వినియోగానికి సంబంధించి గత ఏడాది నుంచి అమలు చేస్తున్న పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(పీఎఫ్‌ఎంఎస్‌)తో ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు తక్కువగా ఉండటంతో ఎలా చేసేదని వాపోతున్నారు. కొంచెం గడువు ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని