logo

ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్‌

గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ హెచ్చరించారు. మిషన్‌ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు.

Published : 29 Mar 2024 03:19 IST

కొల్చారంలోని రైస్‌మిల్లులో తనిఖీ చేస్తున్న రాహుల్‌ రాజ్‌

మెదక్‌, న్యూస్‌టుడే: గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ హెచ్చరించారు. మిషన్‌ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరాపై గూగుల్‌ మీట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాలో ఏమైనా సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో ప్రైవేట్‌ వ్యక్తుల ప్రాధాన్యం ఉండొద్దన్నారు. వేసవి పారంభమైన దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో వెంటనే బోర్ల మరమ్మతులు, ఫ్లషింగ్‌ చేయించాలని ఆదేశించారు. తాగునీరు వృథా కాకుండా ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి లీకేజీలను ఎప్పటికప్పుడు నియంత్రించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు.

ప్రజావాణి రద్దు: జిల్లా అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సీఎంఆర్‌ పూర్తి చేయండి

కొల్చారం, న్యూస్‌టుడే: సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పేర్కొన్నారు. గురువారం కొల్చారంలోని రైస్‌మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాసంగి 2022-23, అలాగే వానాకాలం ధాన్యం బియ్యం వెంటనే అప్పగించాలన్నారు. లేనిపక్షంలో మిల్లర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్‌ హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని