logo

హత్యలతో కలవరం

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు.

Updated : 24 Apr 2024 07:05 IST

ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి
మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. మరో ఘటనలో డబ్బు విషయమై మిత్రుల మధ్య జరిగిన గొడవ ఒకరి అంతానికి దారి తీసింది. హైదరాబాద్‌ దుండిగల్‌లో తల్లి ప్రవర్తన నచ్చని కుమారుడు ఆమెను అంతమొందిచాడు.

డబ్బుల విషయమై వివాదంతో..

 కోహీర్‌: మిత్రుల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. జహీరాబాద్‌ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రవి, ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టకు చెందిన షేక్‌అన్వర్‌అలీ(30), సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం గురుజువాడకు చెందిన మహ్మద్‌ఖైఫ్‌, కోహీర్‌కు చెందిన ముస్తాకిమ్‌లు మిత్రులు. వీరంతా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారిద్దరికి హైదరాబాద్‌ నుంచి ఆటోలను అన్వర్‌ అద్దెకు ఇప్పిస్తుంటాడు. సోమవారం రాత్రి కోహీర్‌కు వచ్చాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పాత భవనం వెనుక ముగ్గురూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అద్దె డబ్బు విషయమై గొడవ జరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి గురైన మహ్మద్‌ఖైఫ్‌, ముస్తాకిమ్‌ కొడవలితో అన్వర్‌అలీపై దాడి చేసి హతమార్చారు. మంగళవారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. హతుడు అన్వర్‌ అలీపై చోరీలు, హత్య కేసు, మహ్మద్‌ఖైఫ్‌పై దొంగతనం, ముస్తాకిమ్‌పై అక్రమ రేషన్‌ బియ్యం సరఫరా కేసు ఉన్నాయని వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


 తల్లి ప్రవర్తన నచ్చక..

దుండిగల్‌: తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే ఆమెను అంతమొందించాడు. దుండిగల్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సాపూర్‌ ఎర్రకుంట తండాకు చెందిన గన్య, సక్కుబాయ్‌ (48) దంపతులకు ఇద్దరు కుమారులు. ఆరేళ్ల క్రితం గన్య మృతి చెందాడు. ఆరు నెలల క్రితం కుమారులతో కలిసి ఆమె డి.పోచంపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటోంది. పెద్ద కొడుకు అంజకు ఇటీవల వివాహం కాగా, అదే ప్రాంతంలో వేరుగా ఉంటున్నాడు. కొంతకాలంగా తల్లి ప్రవర్తన నచ్చక ఆమెను కడతేర్చాలని పెద్ద కొడుకు నిశ్చయించుకున్నాడు. తన మిత్రుడు, మరొకరితో కలిసి పథక రచన చేశాడు. ఈ నెల 20న రాత్రి క్యాటరింగ్‌ పని ఉందంటూ తల్లిని నమ్మించి.. తన వెంట బౌరంపేట పరిధి సతీష్‌ లేఅవుట్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతుపై పొడవడంతో పాటు తల వెనుక భాగంలో రాయితో మోది దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని అదే ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న నీటి సంపులో పడేసి వెళ్లిపోయారు.


పట్టుబడింది ఇలా..

ఆ రోజు రాత్రి తల్లి ఇంటికి రాకపోవడంతో చిన్న కొడుకు అన్నకు విషయం చెప్పాడు. తానే అమ్మను గండిమైసమ్మ చౌరస్తాలో వదిలిపెట్టానని.. పని రద్దవడంతో ఇంటికి వెళ్లమన్నానని తమ్ముడికి చెప్పాడు. స్నేహితురాలిని కలుస్తానని చెప్పిందని నమ్మించాడు. ఆ తర్వాత తమ్ముడు, బంధువులతో కలిసి ఆమె కోసం గాలించినట్లు నటించాడు. ఈ నెల 21న సాయంత్రం బౌరంపేటలోని సతీష్‌ లేఅవుట్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో అమ్మ పర్సు దొరికిందని తమ్ముడికి ఫోన్‌ చేసి చెప్పాడు. తమ్ముడు అక్కడికి వెళ్లగా రక్తం మరకలను గమనించి సమీపంలోని నీటి సంపులో చూడగా తల్లి మృతదేహం కనిపించింది. హతురాలి చిన్న కొడుకు ఫిర్యాదుతో దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గండిమైసమ్మ చౌరస్తాలోని సీసీ ఫుటేజీల ఆధారంగా అంజను, అతడికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుల అరెస్టును పోలీసులు ధ్రువీకరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని