logo

స్వతంత్రులు నామమాత్రమేనా?

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది.

Updated : 07 May 2024 06:14 IST

పెద్దసంఖ్యలో బరిలో దిగినా ఓట్లు తక్కువే
ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది. 19 మంది బరిలో ఉండగా.. స్వతంత్రులుగా పది మంది పోటీచేస్తున్నారు.

పార్టీల ఎత్తుగడలతోనే కొందరు పోటీ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయడంతో పాటు అభ్యర్థులు చేస్తున్న వ్యయంపై నిఘా పెడుతోంది. ముఖ్యంగా నిబంధనలకు అనుగుణంగానే వాహనాలకు అనుమతులు మంజూరు చేస్తోంది. పోలింగ్‌ సమయంలో కేవలంలో అభ్యర్థుల ప్రధాన ఏజెంట్లకు మాత్రమే కేంద్రాల్లోకి వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులను బరిలో దింపి వారిపేరు మీద తమ పార్టీకి చెందిన ముఖ్య అనుచరులకు పాస్‌లు ఇప్పించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల ప్రధాన పోలింగ్‌ ఏజెంట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల అనుచరులే వ్యవహరించారు. ఇది వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ప్రస్తుతం సైతం కొందరు స్వతంత్రులు ప్రధాన పార్టీలకు మద్దతుగా నామినేషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం.

ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చేందుకు..: కొందరు అభ్యర్థులు మాత్రం ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. తమ ప్రాంతంతో ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారని, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చేందుకే తాము పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు చెరకు కర్మాగారం తెరవాలని కోరుతూ బరిలోకి దిగారు. ఇలా క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు, నేతలు, సమాజం దృష్టికి తెచ్చేందుకు బరిలోకి దిగుతున్నా పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీనికి పెరిగిన ప్రచార వ్యయమే ప్రధాన కారణమవుతోంది.

పెరిగిన ఖర్చులు తట్టుకోలేక..

కొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచినా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటీపడేంత వనరులు సమకూర్చుకోవడం సాధ్యపడడం లేదు. మారిన ప్రచార సరళి, ఇతరత్రా వ్యయాల కారణంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీచేయాలంటే రూ.లక్షల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న సాధారణ వ్యక్తులు స్వతంత్రులుగా పోటీచేసి తట్టుకోవడం కష్టంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన, ప్రజలతో మమేకమవడం, పక్కా ప్రణాళికలతో స్వతంత్రులుగా పోటీచేసి గెలుపొంది తమదైన ముద్ర వేసిన నేతలు గతంలో ఎంతోమంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని