logo

మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్‌, కేసీఆర్‌: మందకృష్ణ

మాదిగలను సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.

Published : 09 May 2024 01:11 IST

సంగారెడ్డిలో ప్రసంగిస్తున్న మంద కృష్ణ మాదిగ, పక్కన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, భాజపా నాయకులు

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: మాదిగలను సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సంగారెడ్డిలో ఎమ్మార్పీఎస్‌ మెదక్‌ పార్లమెంట్‌ స్థాయి కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినందుకు కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచీ అండగా ఉన్నామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి మాదిగలను పట్టించుకోలేదన్నారు. ప్రశ్నించినందుకు అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీగా తాను గెలిచేందుకు మాదిగలే కారణమని వేదికల మీద మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటైనా మాదిగలకు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌కు తెలియకుండా సీట్లు కేటాయించారా.. అని ప్రశ్నించారు. సీఎం సొంత సామాజికవర్గమైన రెడ్డిలకు 7 టికెట్లు ఇప్పించుకున్నారన్నారు. ఎమ్మార్పీఎస్‌ మద్దతు ఇస్తున్న భాజపా మూడు స్థానాలను మాదిగలకు ఇచ్చిందన్నారు. భాజపాను గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందన్నారు. వర్గీకరణకు ఎన్డీయే కూటమి అనుకూలంగా, ఇండియా కూటమి వ్యతిరేకంగా ఉందన్నారు. మాదిగ జాతి కోసమే భాజపాను గెలిపించాలని కోరారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, భాజపా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని