logo

సిబ్బంది అరకొర.. సేవలందక విలవిల

వ్యవసాయంతో సమాన ప్రాధాన్యం కలిగిన పాడిరంగంలో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశువైద్యులు లేనిచోట ఇన్‌ఛార్జిలతో నెట్టుకొస్తున్నారు. వైద్యంలో సహాయకులుగా వ్యవహరిస్తున్న అటెండర్లు, కాంపౌండర్ల

Published : 07 Dec 2021 03:59 IST

సకాలంలో పశువులకు అందని వైద్యం

సూర్యాపేట మండలం యండ్లపల్లిలో తెరచుకోని పశువైద్యశాల

సూర్యాపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయంతో సమాన ప్రాధాన్యం కలిగిన పాడిరంగంలో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశువైద్యులు లేనిచోట ఇన్‌ఛార్జిలతో నెట్టుకొస్తున్నారు. వైద్యంలో సహాయకులుగా వ్యవహరిస్తున్న అటెండర్లు, కాంపౌండర్ల కొరత అధికంగా ఉంది. కొన్నిచోట్ల పశువైద్యశాలలను తెరిచేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది ఉన్నా మరికొన్నిచోట్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వైద్యశాలల తలుపులు తెరచుకోవడం లేదు. సిబ్బంది కొరత వల్ల కొందరు గోపాలమిత్రలే గ్రామాల్లో కొద్దిపాటి వైద్యం అందిస్తూ రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది లేకపోయినా భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. గుత్తేదారులు పనులు చేసి బిల్లులు తీసుకుంటున్నారు. వైద్యశాలలు మాత్రం వినియోగంలోకి రావడం లేదని తెలుస్తోంది.

తెరచుకోని పశువైద్యశాలలు..!
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పశువైద్య సిబ్బందిని ఇతర పనులకు వినియోగించినప్పుడు పూర్తి స్థాయిలో మూగజీవాలకు వైద్యం అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పశువైద్యశాలలు వారానికి ఒకసారి మాత్రమే తెరచుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల వ్యాధులకు ఔషధాలు పంపిణీ చేస్తున్నామంటూ ఒకట్రెండు రోజులు మాత్రమే గ్రామాల్లో కనిపించి ఆ తర్వాత సిబ్బంది సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా..
హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పశువైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో 16 మంది వెటర్నరీ వాలంటీర్లను సాగర్‌ సిమెంట్స్‌ పరిశ్రమ యాజమాన్యం నియమించింది. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవతో పరిశ్రమ యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా వాలంటీర్లకు అక్టోబర్‌ నుంచి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తోంది. ఆ ప్రాంతంలో పాడిపశువులకు వైద్యసేవలందుతున్నాయి.


గోపాలమిత్రే దిక్కు

-వెంకటనాగిరెడ్డి, యండ్లపల్లి, సూర్యాపేట మండలం
యండ్లపల్లిలో పశువైద్యుడు, అటెండర్‌ లేరు. గోపాలమిత్ర మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నారు. సిబ్బంది లేనప్పుడు మేం ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. చాలారోజుల నుంచి యండ్లపల్లి పశువైద్య కేంద్రం తెరచుకోవడం లేదు.


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
-శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, సూర్యాపేట

పశువైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో సీఎస్‌ఆర్‌లో భాగంగా సాగర్‌ సిమెంట్స్‌ పరిశ్రమ యాజమాన్యం 16 మంది వాలంటీర్లను నియమించింది. వాలంటీర్ల సహాయంతో అక్కడ వైద్యసేవలు అందిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని