logo

పోషక లోపాలకు చెక్‌..!

చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్‌ పెట్టేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాలు అందడంలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. అధికంగా పోషక గుణాలు ఉన్న అహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. నూతనంగా

Updated : 28 Jan 2022 05:02 IST

బాలామృతం ప్లస్‌తో మూడేళ్ల చిన్నారులకు మేలు

బాలామృతం ప్లస్‌ను లబ్ధిదారులకు అందజేస్తున్న అంగన్‌వాడీ ఉపాధ్యాయిని

మునగాల, తిరుమలగిరి, న్యూస్‌టుడే: చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్‌ పెట్టేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాలు అందడంలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. అధికంగా పోషక గుణాలు ఉన్న అహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. నూతనంగా ‘బాలామృతం ప్లస్‌’ను ప్రవేశపెట్టింది. గతంలో 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్‌ను నెలకు ఒక్కోటి ఇవ్వగా, 1.25 కిలోల బాలామృతం ప్లస్‌ ప్యాకెట్లు రెండింటిని అందిస్తోంది.

అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా నమోదు చేస్తున్నారు. ఈ రికార్డుల ఆధారంగా కొందరు చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని రాష్ట్ర మహిళ అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ, టీఎస్‌ ఫుడ్స్‌, యూనిసెఫ్‌ అధికారులు ప్రత్యేకంగా ‘బాలామృతం ప్లస్‌’ను తయారుచేశారు.

బాలామృతం ప్లస్‌లో పోషకాలు ఇలా...

పాలపొడి, పల్లినూనె, రైస్‌, గోధుమ పిండి, శనగపప్పు, చెక్కరతోపాటు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్‌, కాల్షియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, లియాసిస్‌, జింక్‌ సమృద్ధిగా ఉండే మిశ్రమాలతో ‘బాలామృతం ప్లస్‌’ను తయారుచేశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేసేందుకు వీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.


పిల్లలు ఇష్టంగా తింటున్నారు
-అమరోజు సునీత, లబ్ధిదారు, మునగాల

ప్రభుత్వం నూతనంగా సరఫరా చేస్తున్న బాలామృతం ప్లస్‌ను చిన్నారులు ఇష్టంగా తింటున్నారు. గతంలో సరఫరా చేసిన బాలామృతం కంటే అధిక పోషకాలు ఉండటం వల్ల రుచికరంగా అనిపిస్తుంది.


అవగాహన కల్పిస్తున్నాం
-సంధ్యారాణి, అంగన్‌వాడీ ఉపాధ్యాయిని, మునగాల

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బాలామృతం ప్లస్‌తో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నాం. పుట్టిన పిల్లలు, తల్లులకు విలువైన పోషకాహారం. దీన్ని తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.


చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యం
-జ్యోతిపద్మ, జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారిణి

‘బాలామృతం ప్లస్‌’ అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా చిన్నారులకు అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. చిన్నారుల బరువు కొలతలను బట్టి ఏడు నెలలు నుంచి 36 నెలల వరకు అనుబంధ పౌష్టికాహారంగా రోజుకు 100 గ్రాముల చొప్పున ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని