logo

బాల మేధావి.. అపర వాగ్దేవి

ఆరేళ్ల చిన్నారి.. ప్రపంచ పటంలోని 80 దేశాల రాజధానులు, జెండాలను గుర్తించడంతో పాటు గూగుల్‌, కంప్యూటర్‌, ఎన్‌సీఈఆర్‌టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏటీ తదితర క్లిష్టమైన 100కు పైగా సంక్షిప్త

Updated : 20 May 2022 02:53 IST

తల్లి చంద్రిక అడుగుతున్న గూగుల్‌, కంప్యూటర్‌ వంటి సంక్షిప్త నామాలకు

పూర్తి పదాలు చెబుతున్న చిన్నారి చేతన్‌రెడ్డి

మఠంపల్లి, న్యూస్‌టుడే: ఆరేళ్ల చిన్నారి.. ప్రపంచ పటంలోని 80 దేశాల రాజధానులు, జెండాలను గుర్తించడంతో పాటు గూగుల్‌, కంప్యూటర్‌, ఎన్‌సీఈఆర్‌టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏటీ తదితర క్లిష్టమైన 100కు పైగా సంక్షిప్త నామాలకు పూర్తి పదాలు(అబ్రివేషన్లు) ఇట్టే చెప్పేస్తూ అబ్బుర పరుస్తున్నారు. 100 వరకు ఆవిష్కరణలు, వాటి ఆవిష్కర్తల పేర్లు అడిగిన క్షణాల్లోనే సమాధానమిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు రాజధానులు.. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు.. రాష్ట్ర, దేశ చిహ్నాలు, భూమి ఆవరణలు(పొరలు) అనర్గళంగా చెప్పడం మేధావులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంగ్ల, గణిత, వైజ్ఞానిక అంశాలలో అపార జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఈ చిన్నారి ద్విమితీయ, త్రిమితీయ ఆకారాలు (2డి, 3డి షేప్స్‌) ఖండాలు, మహాసముద్రాలను పేర్కోవడం, ఆసియా, ఆఫ్రికా, నార్త్‌, సౌత్‌ అమెరికాలు, యూరోప్‌ ఖండాల పజిల్స్‌ 2 నిమిషాల్లో పూర్తిచేయడం విశేషం.

తల్లే గురువు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన గాదె తిరుమలరెడ్డి, చంద్రిక దంపతుల ఆరేళ్ల కొడుకు చేతన్‌రెడ్డి ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎంటెక్‌ పూర్తిచేసిన తల్లిదండ్రులలో తిరుమలరెడ్డి పాలకవీడు మండలం మహంకాళిగూడెంలోని డెక్కన్‌ సిమెంట్స్‌ పరిశ్రమలో ఏఈగా, చంద్రిక కోదాడలోని మిట్స్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. డీసీఎల్‌ (డెక్కన్‌ సిమెంట్స్‌) పాఠశాలలో చదువుకుంటున్న చేతన్‌రెడ్డి జ్ఞాపకశక్తి, చురుకుదనాన్ని గుర్తించిన అక్కడి ఉపాధ్యాయులు తల్లిదండ్రులను యూకేజీలో ఉండగానే విజ్ఞానదాయక అంశాలలో సాధన చేయించాలని సూచించారు. విద్యావంతురాలైన తల్లి కొవిడ్‌ సమయంలో జీకే, ఇతర అంశాలపై తర్ఫీదు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ శ్లోకాలు, వేదాలు, ఇతిహాసాలు, షడ్రుచులు, తెలుగు నెలలు, 100 మంది కౌరవుల పేర్లు చెప్పగలగడం చేతన్‌ అపార జ్ఞాపకశక్తికి తార్కాణం. తన కొడుకును ఐఏఎస్‌ చేయించాలన్నదే ఆశయమని తల్లి చంద్రిక తెలిపారు. భర్త తిరుమలరెడ్డి సహకారంతో అంతర్జాతీయ సమాచారాన్ని సేకరించి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని