logo

త్యాగాల ఊరు.. ఆగని కన్నీరు

జలాశయం నిర్మాణంతో తమ ఇళ్లు, భూములను కోల్పోతున్నప్పటికీ భవిష్యత్తు ఆయకట్టు అన్నదాతల కోసం సర్వం త్యాగానికి సిద్ధపడ్డారు నాంపల్లి మండలం లక్ష్మణాపురం భూ

Published : 25 May 2022 02:49 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విలువ ప్రకారం

గజానికి రూ. 300 చూపుతున్న లక్ష్మణాపురం ఇళ్ల స్థలాలు

నాంపల్లి, న్యూస్‌టుడే: జలాశయం నిర్మాణంతో తమ ఇళ్లు, భూములను కోల్పోతున్నప్పటికీ భవిష్యత్తు ఆయకట్టు అన్నదాతల కోసం సర్వం త్యాగానికి సిద్ధపడ్డారు నాంపల్లి మండలం లక్ష్మణాపురం భూ నిర్వాసితులు. తమ ఊరు మునిగి పోతుందన్నా ఊసూరు మనుకున్నారే కానీ పనులకు ఏనాడు అడ్డుపడలేదు. అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం గుంట భూమి కూడా కొనలేని స్థితి వారిది. ఇంటి స్థలాలకు ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పరిహాసంగా మారింది. దీనిపై ‘న్యూస్‌టుడే’ కథనం..

నామమాత్రంగానే పరిహారం..

కిష్టరాయిన్‌పల్లి ప్రాజెక్టు నిర్మాణంలో నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం గ్రామంలోని ముంపునకు గురవుతున్న మొత్తం 175 కుటుంబాలకు సంబంధించి అధికారులు సర్వే నిర్వహించి ఇటీవల రూ.8.53 కోట్ల పరిహారం ప్రకటించారు. ఇందులో కేవలం 57 కుటుంబాలకు సంబంధించిన 13,355 గజాల ఇంటి ఖాళీ స్థలాలకు మాత్రమే గజానికి రూ.57.80 పైసల చొప్పున రూ.7.72 లక్షల పరిహారం చెల్లించారు. మిగిలిన 118 కుటుంబాలకు సంబంధించి జాబితాలో ఇళ్ల స్థలాలు చూపకపోవడంపై నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేకాక తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విలువ ప్రకారం ముంపునకు గురవుతున్న నాంపల్లి మండలం ఎస్‌డబ్య్లూ.లింగోటం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మణాపురంలో గజం ఇంటి స్థలం విలువ రూ.300 చూపిస్తోంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.57 మాత్రమే ఉండటంతో నిర్వాసితులు దిక్కుతోచక మిన్నకుండి పోయారు.

నిబంధనల ప్రకారం చెల్లించాం..

కె.గోపిరాం, ఆర్డీవో, దేవరకొండ

సేకరించిన భూములకు పరిహారం చెల్లించాం. పునరావాసానికి సంబందించి ఆశ్రయం కోల్పోతున్న కుటుంబాల వివరాలతో ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లించాం. లక్ష్మణాపురం నిర్వాసిత గ్రామంలో కొంత మంది ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములుగా నమోదై ఉండటంతో ఆ మేరకు వారు ఇప్పటికే భూ పరిహారం అందుకున్నారు.


మా త్యాగం గుర్తించండి

-దుగ్గి సంజీవరెడ్డి, లక్ష్మణాపురం భూ నిర్వాసితుడు

ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన భూ నిర్వాసితులను అధికారులు, ప్రభుత్వం గుర్తించడం లేదు. భూములు సేకరించే వరకు బుజ్జగింపు మాటలు చెప్పిన అధికారులే నేడు బెదిరిస్తున్నారు. పరిహారంపై ప్రభుత్వం పునరాలోచించాలి.


ఇంటి జాగే లేదన్నారు

వట్టికోటి పద్మమ్మ, పునరావాస బాధితురాలు, లక్ష్మణాపురం

దశాబ్ధాలుగా లక్ష్మణాపురంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న మాకు ఇంటి జాగా పరిహారమే ఇవ్వలేదు. అదేమంటే మీకు ఇల్లు ఉంది కానీ ఇంటి జాగా లేదు అని అధికారులు సమాధానం చెబుతున్నారు. ఉన్న ఊరిని, ఉపాధిని కోల్పోయిన మాకు పూర్తి స్థాయి పరిహారం అందించి ఆదుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని