logo

వివాదాస్పద భూములే పెట్టుబడి!

నల్గొండ జిల్లాలోని ఓ తహసీల్దార్‌ కార్యాలయం అది. అక్కడ పోస్టింగ్‌ కోసం చాలా మంది అధికారులు పెద్ద స్థాయిలో పైరవీలు చేస్తుంటారు. ఇసుక రవాణాతో పాటు పట్టణానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కావడంతో భూముల....

Updated : 17 Aug 2022 04:42 IST

రూ.కోట్లకు పడగలెత్తుతున్న కొందరు తహసీల్దార్లు

* నల్గొండ జిల్లాలోని ఓ తహసీల్దార్‌ కార్యాలయం అది. అక్కడ పోస్టింగ్‌ కోసం చాలా మంది అధికారులు పెద్ద స్థాయిలో పైరవీలు చేస్తుంటారు. ఇసుక రవాణాతో పాటు పట్టణానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కావడంతో భూముల విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఇటీవల ఆ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు తన తండ్రి చనిపోతే ఫౌతి (వారసత్వ మార్పు) చేయాలని సదరు అధికారి దగ్గరకు వెళితే రూ.2 లక్షలు డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.
* ఇదే మండలంలో ఓ రైతుకు 50 ఎకరాల వరకు భూమి ఉండగా.. అందులో 20 ఎకరాలు నిషేధిత జాబితాలో చేరింది. ఫలితంగా రైతుబంధు వంటి ప్రయోజనాలు నిలిచిపోయాయి. ఆ భూమి తనకు పూర్వికుల నుంచి వచ్చిందేనని, ఇందుకు అన్ని ధ్రువపత్రాలు ఉన్నందున దాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని తహసీల్దార్‌ను సంప్రదించారు. ఆ పని చేయాలంటే హైదరాబాద్‌లో విలాసవంతమైన భవంతిని కానుకగా ఇవ్వాలని కోరడంతో సదరు రైతు నివ్వెరపోయారు.
* జిల్లాలోని మరో మండలంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఓ అధికారికి రెవెన్యూలో వ్యవహారాలన్నీ కొట్టిన పిండి. యూనియన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆ మండలంలోని వివాదాస్పద భూముల వివరాలు తెలుసుకుంటారు. కలెక్టరేట్‌లోని ఇద్దరు అధికారుల ద్వారా వాటి వివరాలను ఉన్నతాధికారులకు చెప్పి వాటి క్రయవిక్రయాలకు ఎన్‌వోసీ తీసుకొస్తారు. ఇటీవలే సుమారు రూ.3 కోట్ల విలువైన రెండెకరాల భూమికి సైతం ఎన్‌వోసీ తీసుకొచ్చి తన అనుయాయులకు రిజిస్త్ట్రేషన్‌ చేయించినట్లు సమాచారం.

ఈనాడు, నల్గొండ: నల్గొండ జిల్లాలోని కొంత మంది తహసీల్దార్ల అవినీతి అక్రమాల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి పనికీ రేటు కట్టి, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతుండటంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా నల్గొండ, దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న నలుగురు తహసీల్దార్లు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. నల్గొండ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్‌ రెండున్నరేళ్లలో ఇసుక అక్రమ రవాణాతో పాటు వివాదాస్పద భూములకు ఎన్‌వోసీ ఇప్పిస్తూ రూ.కోట్లు కూడబెట్టుకున్నట్లు సంబంధిత రెవెన్యూ వర్గాల ద్వారానే తెలిసింది. సదరు తహసీల్దార్‌ గతంలో జిల్లా ఉన్నతాధికారుల వద్ద పనిచేయడంతో ఆ చనువునే పెట్టుబడిగా శాఖలో తనకున్న పరిచయాలతో అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుతో పాటు దేవరకొండ నియోజకవర్గంలోని ముగ్గురు తహసీల్దార్లు యూనియన్‌ నేతలుగా చలామణి అవుతూ వివాదాస్పద భూములను ‘ధరణి’ వెబ్‌సైట్‌లోని లోపాలను ఆసరాగా చేసుకొని వాటికి ఎన్‌వోసీలు ఇప్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ అక్రమాలన్నింటికీ ఓ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఇటీవల చింతపల్లి మండలంలో భూదాన్‌ భూములను కబ్జా చేయడంలోనూ ప్రజాప్రతినిధులు పాత్ర ఉందనేది ఇప్పటికే నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించగా....జిల్లా వ్యాప్తంగా కొంత మంది తహసీల్దార్లు ముఖ్య ప్రజాప్రతినిధులతో సఖ్యతగా ఉంటూ పెద్దఎత్తున అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఇటువైపు చూడకపోవడంతో ఇందులో వారి పాత్ర ఎంతన్నది తేలాల్సి ఉందని జిల్లా స్థాయి అధికారి ఒకరు ‘ఈనాడు’తో అభిప్రాయపడ్డారు. దేవరకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టరాయినిపల్లి జలాశయాల పరిధిలో నిర్వాసితులకు పరిహారం పంపిణీలోనూ అనేక అక్రమాలు జరిగాయని కొంత మంది ఇటీవలే హైదరాబాద్‌లోని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని