logo

ఆడపడచుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీరాజనం పలుకుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 04 Dec 2022 05:00 IST

సూర్యాపేటలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను
పంపిణీ చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీరాజనం పలుకుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని 518 మందికి జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రూ.5.18 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను శనివారం పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడపడచుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింది ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు అందజేసినట్లు చెప్పారు. అనంతరం గ్రామాల వారీగా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. జడ్పీటీసీ సభ్యుడు జీడి భిక్షం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

కుడకుడరోడ్డు(సూర్యాపేట): దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటూ నిధులు కేటాయిస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో దివ్యాంగులకు జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో కూడిన ప్రత్యేక భవనాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెండు కాళ్లు కోల్పోయిన సూర్యాపేట వాసి నజీర్‌ జ్యూస్‌ దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు మైనారిటీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో రూ.4.50 లక్షల చెక్కు, గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన దివ్యాంగుడు పోలంపల్లి మహాంజనేయులుకు రూ.3 లక్షల చెక్కు అందించారు. అర్హులకు ట్రై సైకిల్‌, వీల్‌ఛైర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, పుర ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని